Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. సాంకేతిక లోపమా..?మానవ తప్పిదమా?

ఒడిశా ఘోర రైలు ప్రమాదం వెనుక కారణాలేంటనేది అంతుచిక్కడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా రైళ్లు ఢీకొని ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 03 Jun 2023 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికపరమైన సమస్యనా? లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (Odisha Train Tragedy)

రెండు ప్రయాణికుల రైళ్ల, ఒక గూడ్స్‌ రైలు వెనువెంటనే ఢీకొనడంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్నమైన కథనాలు వెలువడుతున్నాయి. తొలుత బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bengaluru-Howrah Superfast Express ) పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై పడగా.. దానిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Shalimar-Chennai Central Coromandel Express) ఢీకొట్టిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కోరమాండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొన్నట్లు పేర్కొన్నారు. అయితే, రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పిందని, వాటి బోగీలను బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు ఢీకొన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రైల్వే అధికారి చెప్పిందే నిజమైతే.. గూడ్స్‌ రైలు ఉన్న ట్రాక్‌పైకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఎలా అనుమతించారనే ప్రశ్న తలెత్తుతోంది. సిగ్నల్‌ వ్యవస్థ (signal error)లో లోపం కారణంగా ఈ తప్పిదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ సమాచార లోపం సాంకేతిక సమస్యతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా?అనేది తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘సిగ్నలింగ్‌ వ్యవస్థ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. దీని వెనుక ఇంకేమైనా కారణముందా?’’ అని టీఎంసీ నేత ఆరోపించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ‘కవచ్‌’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

కవచ్‌ ఉంటే.. భారీ నష్టం తప్పేదేమో..!

రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ‘కవచ్‌ (Kavach)’ పేరుతో యాంటీ కొలిజన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెడ్‌ (డేంజర్‌) సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ కవచ్‌ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. దీంతో రైళ్లు ఢీకొనే ప్రమాదాలను నిలువరించొచ్చు. అయితే ప్రస్తుతం ఈ కవచ్‌ వ్యవస్థ దేశంలో కొన్ని మార్గాల్లోనే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ప్రమాదం జరిగిన మార్గంలో ఈ కవచ్‌ వ్యవస్థను ఇంకా తీసుకురాలేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని