CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో సీబీఐ దాడులు.. భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.

Published : 20 Aug 2022 01:33 IST

దిల్లీ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో సీబీఐ దాడులు.. భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. మంచి పనులకు లభించిన ప్రతిఫలమిదంటూ ఆప్‌ కన్వీనర్ సిసోదియాకు మద్దతిస్తూ కేజ్రీవాల్‌ భాజపాపై విమర్శలు చేయగా.. కాషాయ పార్టీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టింది. నూతన అబ్కారీ విధానంలో అవకతవకల గురించి తన నేతపై కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

భాజపా ఎంపీ ప్రవేశ్‌ వర్మ మాట్లాడుతూ.. ‘అరవింద్ కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. సిసోదియా, సత్యేందర్‌ జైన్‌కు పెరుగుతోన్న ప్రజాదరణ ఆయనలో భయాన్ని కలిగించి ఉండొచ్చు. వారిని పక్కకు తప్పించాలని భావించి ఉండొచ్చు. కేజ్రీవాల్ అనుమతి లేకుండా వారు చిన్న బ్రేక్ కూడా తీసుకోరు. కానీ, ఇప్పుడు జైన్ మూడు నెలల నుంచి జైల్లో ఉన్నారు. సిసోదియాపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఇంక కేజ్రీవాల్ మాత్రం ఎంతకాలం స్వేచ్ఛగా ఉండగలరు? ఆప్‌లో మొత్తం వ్యవహారం నడిపించేది కేజ్రీవాలే. తనవద్ద ఏ శాఖ ఉండకపోవడంతో దేనిపై ఆయన సంతకాలు చేయరు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం.. తన నిజాయతీని చూపించుకునేందుకు తన మంత్రులను జైలుకు పంపుతారు’ అంటూ ఆప్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 

దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టింది. సిసోదియా నివాసం, కార్యాలయంతో పాటు మాజీ ఎక్సైజ్‌ కమిషనర్‌ గోపీకృష్ణ తదితరుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించింది. 

అప్పుడు మఫ్లర్లు.. ఇప్పుడు పెన్సిళ్లు: ఆప్‌

సీబీఐ దాడులపై ఆప్‌ ప్రతినిధి రాఘవ చద్దా మాట్లాడుతూ.. ‘గతంలో ఆప్‌ నేతల ప్రాంగణాల్లోనూ సోదాలు జరిగాయి. కేజ్రీవాల్‌కు సంబంధించిన పరిసరాల్లో మఫ్లర్లు దొరికాయి. సిసోదియా ఇంట్లో పెన్సిళ్లు, నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు దొరుకుతాయి. వారు సిసోదియా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు’ అంటూ విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని