Sonali Phogat: సోనాలీ ఫోగాట్‌ శరీరంపై గాయాలున్నాయ్‌.. పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి

ఇటీవల గోవా పర్యటనలో ఉండగా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన హరియాణాకు చెందిన భాజపా నాయకురాలు, నటి సోనాలీ ఫోగాట్‌ (42) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది......

Published : 26 Aug 2022 01:05 IST

పనాజీ: భాజపా నాయకురాలు, నటి సోనాలీ ఫోగాట్‌ (42) ఆకస్మిక మరణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమె గుండెపోటుకు గురై మరణించారని గతంలో పోలీసులు వెల్లడించగా.. తాజాగా పోస్టుమార్టం నివేదికలో మాత్రం  ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది. సోనాలీ ఫోగాట్‌ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే, గోవా పర్యటనలో ఆమెతో పాటు ఉన్న సుధీర్‌ సగ్వాన్‌, సుఖ్విందర్‌ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, సోనాలీ ఫోగాట్‌ కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఆమె భౌతికకాయానికి గోవా ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుమార్టం పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

మాజీ టిక్‌టాక్‌ స్టార్‌గా, ‘బిగ్‌బాస్‌’ టీవీ రియాలిటీ షో ద్వారా  ప్రాచుర్యం పొందిన సోనాలీ  తన సిబ్బందితో కలిసి ఇటీవల గోవా పర్యటనకు వెళ్లారు. ఆమెకు అస్వస్థతగా ఉందని గత సోమవారం రాత్రి ఉత్తర గోవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు అధికారులు తొలుత వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సోనాలీ రాత్రి 7 - 8 గంటల మధ్య కూడా పింక్‌ రంగు తలపాగాతో ఉన్న తన వీడియోలు, చిత్రాలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 9లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోనాలీ మృతి పట్ల గోవా డీజీపీ జస్పాల్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. మరణానికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికలో తేలుతుంది’ అని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన సోనాలీ మృతి పట్ల ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహా పలు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని