చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారా?.. లేడీసింగం పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు

ముందస్తు ప్రణాళిక ప్రకారమే అస్సాం మహిళా పోలీసు జున్మణి రాభా(Junmoni Rabha)ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. 

Updated : 19 May 2023 18:01 IST

నగావ్‌: అస్సాం(Assam)కు చెందిన మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా(Junmoni Rabha) మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ సందేహాలను బలపరిచేలా ఇప్పటికే ఓ ఆడియో, వీడియో క్లిప్‌ వైరల్ కాగా.. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం(Postmortem) నివేదిక మరింత చర్చనీయాంశంగా మారింది. ముందస్తు పథకం ప్రకారమే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానం అందులో వ్యక్తమైంది. నివేదికలో వైద్యులు పేర్కొన్న వివరాల ప్రకారం.. 

ఆమె(Junmoni Rabha) శరీరంపై పలు చోట్ల, తల వెనక భాగంలో గాయాలున్నాయి. ప్రమాదం తర్వాత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా.. అది పూర్తిగా బిగుసుకుపోయిన స్థితిలో ఉంది. సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కొన్ని గంటల తర్వాత శరీరం అలా మారుతుంది. ఘటనాస్థలం నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో ప్రమాదం సమయంలోనే ఆమె శరీరం బిగుసుకుపోయిందని తెలుస్తోంది. కాళ్లూ చేతులు వాటి జాయింట్స్ వద్ద రాసుకుపోయిన గాయాలు, నుదురు ఎడమవైపు భాగంలో లోతుగా గాయం ఏర్పడింది. తల వెనకవైపు ఎముక విరిగి ఉంది. ఛాతి, పొత్తికడుపు మధ్యభాగంలో ఎర్రగా కందిపోయిన గాయాలున్నాయి. 

‘రక్తస్రావం, షాక్‌ వల్ల గుండె, శ్వాస వ్యవస్థల వైఫల్యంతో మరణం సంభవించింది. వాటికి పొత్తికడుపు, మెదుడులో గాయాలు తోడయ్యాయి’ అని వైద్యులు నివేదికలో చివరిగా ఒక అంచనాకొచ్చారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఘటన కావడానికి ఆస్కారం ఎక్కువ. ఆ గాయాలు ట్రక్కు ఢీకొనడం వల్ల జరిగినవిగా కనిపించడం లేదని పేర్కొన్నారు. అలాగే ఘటనా స్థలం దృశ్యాలను బట్టి.. ఆమె కారు ఎయిర్‌ బ్యాగ్స్ తెరుచుకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఛాతి, పొత్తికడుపు వద్ద గాయాల తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. 

‘లేడీ సింగం’.. ‘దబంగ్‌ కాప్‌’గా పేరు తెచ్చుకొన్న మహిళా ఎస్‌ఐ జున్మణి రాభా (30)(Junmoni Rabha) మంగళవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో మృతిచెందారు. ఈమె ప్రయాణిస్తున్న ప్రైవేటు కారును నగావ్‌ జిల్లా పరిధి జఖలాబంధా పోలీస్‌స్టేషను పరిధిలో ఓ కంటైనర్‌ ట్రక్కు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కొన్నిగంటల ముందే జున్మణిపై దోపిడీ కేసు నమోదు కావడం గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఎటువంటి సెక్యూరిటీ, యూనిఫాం లేకుండా ప్రైవేటు కారులో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ రోడ్డు ప్రమాదం వెనక ఒక నకిలీ బంగారం సిండికేట్ హస్తం ఉందని, ఆ సిండికేట్‌ వ్యక్తుల్ని రక్షించేందుకు పోలీసు విభాగానికి చెందిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసే యత్నంలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు