ఆ డ్రగ్‌పై ఆశలు ఆవిరి?

కొవిడ్‌-19 చికిత్సలో మెరుగైన ఫలితాలిస్తుందని ఇప్పటి వరకు భావించిన యాంటీవైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌’ ప్రయోగ దశలోనే విఫలమైనట్లు సమాచారం.....

Updated : 24 Apr 2020 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 చికిత్సలో మెరుగైన ఫలితాలిస్తుందని ఇప్పటి వరకు భావించిన యాంటీవైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌’ ప్రయోగ దశలోనే విఫలమైనట్లు సమాచారం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ముసాయిదా పత్రాన్ని అనుకోకుండా ఉంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఆ వివరాల ప్రకారం.. రెమ్‌డెసివిర్‌ కరోనా రోగులపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలుస్తోంది. అయితే, దీన్ని తయారు చేస్తున్న అమెరికా ఫార్మా కంపెనీ గిలీడ్‌ సైన్సెస్‌ మాత్రం ఈ వార్తల్ని తోసిపుచ్చింది. నివేదికను వక్రీకరించారని వాదిస్తోంది. ఈ ప్రయోగ ఫలితాలకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని డబ్ల్యూహెచ్‌ఓ వెంటనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించడం గమనార్హం. అయితే, ఇది మెరుగైన ఫలితాలిస్తున్నట్లు గతంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇటు భారత్‌లో ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త ఒకరు తెలపడంతో ఈ డ్రగ్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.  

అధ్యయనం ఎలా జరిగింది..

చైనాలో వైరస్‌ సోకిన 237 మందిని ఈ అధ్యయనానికి తీసుకున్నారు. వీరిలో 158 మందిలో ‘రెమ్‌డెసివిర్‌’ ప్రయోగించారు. మిగతా 79 మందికి ఎలాంటి మందులు ఇవ్వకుండా ఉంచారు. అలా రోజూ రెండు బృందాల్లోని వ్యక్తుల ఆరోగ్యంలో సంభవించిన మార్పుల్ని గమనించారు. ఒక నెల తర్వాత పరిశీలిస్తే డ్రగ్‌ తీసుకున్నవారిలో 13.9శాతం మరణించారు. తీసుకోనివారిలో 12.8శాతం మృతి చెందారు. అలాగే డ్రగ్ తీసుకున్నవారిలో ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ ఉండడంతో తొలిదశలోనే ప్రయోగాల్ని నిలిపివేశారు. చివరగా.. రెమ్‌డెసివిర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు.

గిలీడ్‌ సైన్సెస్‌ ఏమంటోందంటే..

డబ్ల్యూహెచ్‌ఓ చర్యతో గిలీడ్‌ సైన్సెస్‌ తీవ్రంగా విభేదించింది. అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని ఆ నివేదిక తప్పుగా వెలిబుచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, దీని ప్రయోగానికి ఎక్కువ మంది రోగులు ముందుకు రాలేదని.. అందుకే పరీక్షల్ని తొలిదశలోనే నిలిపివేశామని తెలిపారు. తక్కువ మందిపై ప్రయోగించి ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు. అయితే, వైరస్‌ తొలిదశలో ఉన్నవారిలో ఆశాజనక ఫలితాలున్నట్లు మాత్రం సమాచారం ఉందన్నారు. దీంతో డ్రగ్‌ వాడకానికి సంబంధించిన ప్రయోగాలు ముగిసిపోలేదని.. ఇంకా పరీక్షలు కొనసాగుతాయన్నారు.

ఇవీ చదవండి..

వ్యాక్సిన్‌ పరీక్షకు అతిదగ్గరలో ఉన్నాం: ట్రంప్‌

వేసవి పరిస్థితులతో కరోనా వైరస్‌ నశిస్తుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని