Delhi: దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్‌లో ఇబ్బందులు

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 17 Jun 2024 16:07 IST

దిల్లీ: దిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో సోమవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం(Power outage) ఏర్పడింది. దీని వల్ల బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియలకు ఇబ్బందులు కలగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.  ప్రయాణికులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు తమ పోస్ట్‌ల్లో టెర్మినల్ 3లో అరగంట నుంచి కరెంట్‌ లేదని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరెంటు అంతరాయానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. దీనిపై దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) స్పందిస్తూ సమస్యను పరిశీలిస్తున్నామని, విద్యుత్‌ను పునరుద్ధరించడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపింది. దిల్లీ విమానాశ్రయంలో మూడు టర్మినల్స్‌ ఉండగా మొదటి రెండు దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. మూడో టర్మినల్  దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు వినియోగిస్తారు.కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైందని కొందరు ప్రయాణికులు తెలిపారు. కరెంట్‌ లేకపోవడం వల్ల చెక్-ఇన్ కౌంటర్లు, డిజి యాత్ర సేవలకు అంతరాయం ఏర్పడింది. 

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండోలాలోని పవర్‌ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. నగరానికి ఈ గ్రిడ్‌ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని