Chandigarh: 36 గంటలుగా కరెంట్ కట్‌.. అంధకారంలో చండీగఢ్‌

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో విద్యుత్‌ విభాగం సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో చండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో గత 36 గంటలుగా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది.

Updated : 23 Feb 2022 12:42 IST

చండీగఢ్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో విద్యుత్‌ విభాగం సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో చండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో గత 36 గంటలుగా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్‌ కట్‌ అవడంతో నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ లైట్లు వెలగట్లేదు. ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చండీగఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ విద్యుత్‌ విభాగ సిబ్బంది మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెను వెనక్కి తీసుకోవాలని అధికారులు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సిబ్బంది సమ్మె చేపట్టారు. విధులకు హాజరుకావట్లేదు. ఫలితంగా అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. 

సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సమస్య తలెత్తింది. 36 గంటలు గడిచినా ఇంకా కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పవర్‌ కట్‌తో ఆన్‌లైన్‌ క్లాసులు నిలిచిపోయాయి. కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు మూతబడ్డాయి. ఆసుపత్రులను జనరేటర్లతో నడిపిస్తున్నప్పటికీ.. కొన్ని శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. 

పోన్‌ ఛార్జింగ్‌ల కోసం పొరుగు నగరాలకు..

నిరంతరాయంగా కరెంట్‌ లేకపోవడంతో ఫోన్లలో ఛార్జింగ్‌ కూడా లేని పరిస్థితి. దీంతో చాలా మంది ప్రజలు ఫోన్‌ ఛార్జింగ్‌లు పెట్టుకునేందుకు పొరుగు నగరాల్లో ఉండే తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న మోహాలీ, జిరాక్‌పుర్‌, పంచకుల ప్రాంతాల్లో చండీగఢ్‌ వాసుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 

ఎస్మా ప్రయోగం.. 

పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చండీగఢ్‌ పాలనా యంత్రాంగం వివిద్యుత్‌ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ ఇంకా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం నాటికి కరెంట్‌ కోత కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని