Intelligence Agencies : మనకు ‘రా’.. మరి మిగతా దేశాలకు?
ఈ మధ్య గూఢచర్యం నేపథ్యంలో తీసిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఓ గూఢచారి విదేశానికి వెళ్లి అక్కడ ఆపరేషన్ నిర్వహించడం లేదా దేశంలోకి చొరబడ్డ శత్రుమూకలను కనిపెట్టి, వారు చేయబోయేదాడులను అడ్డుకోవడం వంటి కథలతో బోలేడు చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి. శత్రువులకు
ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ భారతీయ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్‌కు విపరీతమైన క్రేజ్ రావడంతో ఇటీవల సీజన్ 2ని కూడా విడుదల చేశారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయీ గూఢచారిగా అద్భుతంగా నటించాడు. ఇంటెలిజెన్స్ విభాగమైన టాస్క్(థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వెవలైన్స్ సెల్)లో పనిచేస్తూ ఉగ్రదాడుల్ని ముందుగానే పసిగట్టి నిలువరిస్తాడు. ఇదే కాదు.. ఈ మధ్య కాలంలో గూఢచర్యంపై అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. దీంతో దాదాపు అందరికి గూఢచారి ఏం చేస్తాడు?రాబోయే అపాయాలను ఎలా పసిగడతాడు వంటి విషయాల్లో అవగాహన వచ్చేసింది. అయితే, ఫ్యామిలీమ్యాన్‌లో ఉన్న టాస్క్ కల్పితమైందే అయినా.. నిజంగానే ప్రపంచంలో అన్ని దేశాలకు సొంతంగా ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. అందులో అనేక మంది గూఢచారులు పనిచేస్తుంటారు. మన భారతదేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) పేరుతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. మరి ఇతర దేశాలకు ఏం ఉన్నాయో చూద్దామా..!
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), భారత్
మన దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. 1933లో అప్పటి బ్రిటీష్ రాజ్ ప్రభుత్వం దేశ భద్రత కోసం ఇంటెలిజెన్స్ బ్యూరోని ఏర్పాటు చేసింది. 1947 స్వతంత్రం వచ్చాక సంజీవి పిళ్లై అనే అధికారి ఐబీకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే, ఐబీలో శిక్షణ పొంది, పనిచేస్తున్న వారంతా భారత్‌కు స్వతంత్రం రాగానే.. తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. దీంతో ఆయన యూకే ఇంటెలిజెన్స్ విధానాలతో చిన్నపాటి ఫారెన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ.. ఈ బృందం 1962లో చైనాతో యుద్ధాన్ని ఆపలేకపోయింది. దీంతో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శక్తిమంతమైన ఒక నిఘాసంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ అప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
ఇంటెలిజెన్స్ లోపంతో భారత్ 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి ఆర్మీ జనరల్ జొయంతో నాథ్ చౌధురీ కూడా బలమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు 1966లో ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. నెహ్రూ కుమార్తె, భారత మూడో ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఐబీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్.ఎన్ కావ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఒక బ్లూప్రింట్ సిద్ధం చేశారు. అది ప్రభుత్వానికి బాగా నచ్చడంతో ఆయన్నే చీఫ్‌గా నియమిస్తూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)ను 1968 సెప్టెంబర్ 21న ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి రహస్య సమాచారాలు సేకరించడం, ఉగ్రదాడులు, ఆక్రమణలను నిరోధించడం, చట్టసభ్యులకు సలహాలు సూచనలు ఇవ్వడం వీటి విధులు. అలాగే, భారత న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు భద్రత కల్పించే బాధ్యత కూడా ‘రా’దే. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని దిల్లీలోని ఉంది.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), యూఎస్‌ఏ
అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశంగా కొనసాగుతుండటంలో సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఈ ఏజెన్సీ నిరంతరం శ్రమిస్తోంది. గూఢచర్యం చేస్తూ అమెరికాకు ఎలాంటి ఆపద రాకుండా.. వచ్చినా ముందుగానే నిలువరించేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతకు సంబంధించిన విషయాలను సేకరించి.. వాటిని విశ్లేషించడం సీఐఏ ప్రధాన కర్తవ్యం. అలా సేకరించిన నివేదికలను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏజెన్సీ 1947 సెప్టెంబర్ 18న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వర్జీనియా రాష్ట్రంలోని లాంగ్లీలో ఉంది.
ఇంటర్ - సర్వీస్ ఇంటెలిజెన్స్, పాకిస్థాన్
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ గురించి అందిరికి తెలిసిందే. ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్‌పై దాడులకు పాల్పడుతుందని అనేక ఆరోపణలు వస్తుంటాయి. కానీ, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విదేశాలు.. ముఖ్యంగా భారత్ నుంచి రహస్య విషయాలను సేకరించి పాక్‌కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమోనని విశ్లేషిస్తుంటుంది. ఐఎస్‌ఐలో ఆర్మీ, నేవీ, వైమానిక బలగాల్లోని అధికారులు సభ్యులుగా ఉంటారు. అందుకే, దీన్ని ఇంటర్-సర్వీస్ అని పేరు పెట్టారు. ఇస్లామాబాద్‌లోని ఆబ్‌పరాలో 1948 జనవరి 1న దీన్ని ఏర్పాటు చేశారు.
మొసాద్, ఇజ్రాయెల్
మొసాద్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ అని అర్థం. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ మొసాద్.. ప్రపంచంలో అత్యంత సాహసోపేత అండర్‌కవర్ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించింది. సమాచారం సేకరించడం, ఉగ్రవాదాన్ని నిరోధించడం వంటివి మొసాద్ ప్రధాన కర్తవ్యాలు. కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించడంలో దిట్ట. ఇజ్రాయెల్ రాజ్యాంగానికి, చట్టాలకు అతీతంగా ఈ ఏజెన్సీ పనిచేస్తుంటుంది. దీన్ని 1949 డిసెంబర్ 13న టెల్ అవివ్‌లో స్థాపించారు.
సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (మిలటరీ ఇంటెలిజెన్స్ 6), యూకే
సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్(మిలటరీ ఇంటెలిజెన్స్, సెక్షన్ 6), ఎంఐ6 ప్రపంచంలోనే అత్యంత పురాతన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఒకటి. 1569లో తొలిసారి సీక్రెట్ సర్వీస్‌గా ఏర్పాటైంది. అప్పటి క్వీన్ ఎలిజబెత్ Iకు సెక్రటరీగా పనిచేసిన సర్. ఫ్రాన్సిస్ వాల్సింగమ్ దీన్ని ప్రారంభించారు. అయితే, ఇది కాలక్రమంలో అనేక రూపాలు మార్చుకుంది. 1909లో సీక్రెట్ సర్వీస్ బ్యూరోగా ఉన్న ఈ ఏజెన్సీ మొదటి ప్రపంచయుద్ధం తర్వాత 1920లో ఎస్‌ఐఎస్ ఎంఐ6గా మారింది.ఉగ్రవాదం అణిచివేత, ఆక్రమణలు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటుంది. అంతేకాదు, సీఐఏతోపాటు అనేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తనవంతు సాయం చేస్తుంటుంది. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.
ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఏఎస్‌ఐఎస్), ఆస్ట్రేలియా
ప్రపంచవ్యాప్తంగా గూఢచారుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడంలో ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ముందుంటుంది. ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంటుంది. 1952 మే 13న ప్రారంభించిన ఈ ఏజెన్సీ ఆస్ట్రేలియన్ డిపార్ట్‌మెంట్ ఆప్ ఫారెన్ ఎఫైర్స్ అండ్ ట్రేడ్ శాఖలో ఒక భాగంగా ఉంది. దీని ప్రధాన కార్యాలయం కాన్‌బెర్రాలోఉంది. గూఢచారుల నుంచి సేకరించిన రహస్యాల నివేదికను విదేశాంగశాఖ మంత్రికి నేరుగా అందిస్తుంది.
డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఎక్స్‌టర్నల్ సెక్యూరిటీ(డీజీఎస్‌ఈ), ఫ్రాన్స్
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఎక్స్‌టర్నల్ సెక్యూరిటీ.. బ్రిటన్‌కు చెందిన ఎంఐ6, అమెరికా సీఐఏతో సమానంగా పనిచేస్తుంటుంది. పారామిలటరీ నిర్వహణ, శత్రువుల కుయూక్తులను తిప్పికొట్టే ఆపరేషన్స్‌లో డీజీఎస్‌ఈకి ఎక్కువ నైపుణ్యం ఉంది. ఫ్రాన్స్ రక్షణశాఖ ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీ విధులు నిర్వర్తిస్తుంటుంది. దీన్ని 1982 ఏప్రిల్ 2న పారిస్‌లో ఏర్పాటు చేశారు.
ది ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్,(బీఎన్‌డీ), జర్మనీ
ది ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(బీఎన్‌డీ)ను 1956 ఏప్రిల్ 1న బెర్లిన్‌లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన కార్యాలయం కలిగిన ఏజెన్సీ ఇదే. జర్మనీతోపాటు విదేశాల్లో 300 చోట్ల ఈ ఏజెన్సీ పనిచేస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఆయుధాలు.. సాంకేతికత అక్రమ రవాణా వంటి అంశాల్లో రహస్యాలను బీఎన్‌డీ సేకరిస్తుంటుంది. అలా సేకరించిన రహస్యాలను నేరుగా ఛాన్సలర్‌కు నివేదించాల్సి ఉంటుంది.
మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, చైనా
రహస్యాలను వెలికితీయండం, దేశంలో రాజకీయ భద్రతను చూసుకోవడం కోసం చైనాలో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఏర్పాటైంది. ఈ ఏజెన్సీ అత్యంత రహస్యమైనదిగా భావిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ కన్నా ముందు దీని స్థానంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) ఉండేది. సీఐడీని, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను కలిపేసి బీజింగ్‌లో 1983 జులై1న ఎంఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. చైనాకు వ్యతిరేకంగా పనిచేసే శత్రు ఏజెంట్లు, గూఢచారులను పట్టుకునేందుకు శతవిధాల కృషి చేస్తుంది.
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్(ఎఫ్‌ఎస్‌డీ), రష్యా
రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ముఖ్యంగా దేశీయంగా దాడులు, నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించి ఏర్పడింది. దేశ అంతర్గత భద్రత, ఘర్షణలు, ప్రణాళికతో చేసే నేరాలు, ఉగ్రదాడులను ముందుగానే పసిగట్టి నిలువరించడంలో ఈ ఏజెన్సీ తలమునకలైపోతుంది. 2011లో ఈ ఏజెన్సీ 94 ఉగ్రదాడులను అడ్డుకోగలిగింది. ఎఫ్‌ఎస్‌డీ ప్రధాన కార్యాలయం మాస్కోలోని లుబ్యాంకా స్క్వేర్‌లో ఉంది. గతంలో రష్యా సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ఈ ఏజెన్సీ కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ పేరుతో పనిచేసింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్
-
Germany: మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!
-
Nayanthara: స్టూడెంట్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో చూశారా!
-
భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!
-
Social Look: క్యూట్ ట్రైనర్‌తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్
-
Election Results: అహంకార కూటమికి.. ఇదో హెచ్చరిక: ప్రధాని మోదీ