Fuel Price Hike: ఇది ప్రధానమంత్రి జన్‌ధన్‌ ‘లూట్‌’ యోజనే..!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడం ప్రజల ధనాన్ని దోపిడీ చేయడమేనన్న రాహుల్‌ గాంధీ.. ప్రధానమంత్రి జన్‌ధన్‌ ‘లూట్‌’ యోజనగా అభివర్ణించారు.

Published : 04 Apr 2022 16:49 IST

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ధ్వజం

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మండిపడ్డారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇది ప్రజల ధనాన్ని దోపిడీ చేయడమేనన్న ఆయన.. ప్రధానమంత్రి జన్‌ధన్‌ ‘లూట్‌’ యోజనగా అభివర్ణించారు. అప్పట్లో బైక్‌, కారు, ట్రాక్టర్‌, ట్రక్కులను ఫుల్‌ ట్యాంక్‌ చేయడానికి అయ్యే ఖర్చు.. ప్రస్తుత ధరలను పోల్చుతూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

‘నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు పొద్దున ఉత్సాహం కంటే ద్రవ్యోల్బణం పెరుగుతోన్న బాధతోనే మొదలవుతుంది. ఈ ఉదయం పెట్రోల్‌, డీజిల్‌పై మరో లీటరకు 40 పైసలు పెరిగింది. ఇంధన దోపిడీలో ఇది మరో ఇన్‌స్టాల్‌మెంట్‌’ అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. ఇలా గడిచిన రెండు వారాల్లోనే పెట్రోల్‌, డీజీల్‌పై రూ.8.40పైసలు పెరిగిందన్న ఆయన.. సీఎన్‌జీ కూడా కేజీకి రూ.2.50 పెరిగిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భాజపాకు ఓటు వేయడమంటే ద్రవ్యోల్బణం అనివార్యం అన్నట్లేనా..?అంటూ రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు.

ఇదిలాఉంటే, నాలుగు నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి మొదలైన బాదుడుతో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై మరో 40పైసలు పెరిగింది. ఇలా గడిచిన రెండు వారాల్లోనే 12సార్లు పెరగగా.. మొత్తంగా రూ.8.40 పెరుగుదల కనిపించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌ లీటరు ధర రూ.110 దాటగా.. డీజిల్‌ వంద రూపాయలను దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని