Pramod Sawant: గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్(48) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఆయన ఈ పదవిని చేపట్టారు.

Updated : 28 Mar 2022 12:21 IST

వరుసగా రెండోసారి పదవి చేపట్టిన నేత

పనాజీ: గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్(48) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఆయన ఈ పదవిని చేపట్టారు. అక్కడి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్, ఇతర ప్రముఖులు హాజరై.. కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన సంగతి తెలిసిందే. 40 స్థానాలున్న అసెంబ్లీకి కమలం పార్టీ నుంచి 20 మంది సభ్యులు ఎన్నికయ్యారు. దాంతో మెజార్టీకి ఒక్క సీటు దూరమైంది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర వాది గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సావంత్‌ తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రెండురోజుల పాటు అసెంబ్లీ సెషన్‌ కోసం గవర్నర్ సీఎస్ శ్రీధరన్‌ పిళ్లై ఆదేశాలిచ్చారు.

2019లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్ మరణించడంతో సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికల విజయంతో రెండోసారి ఆ పదవిని చేపట్టారు. పారికర్ వలే ఈయన కూడా రాజభవన్ ప్రాంగణంలో కాకుండా బయట ప్రమాణ స్వీకారం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని