Prashant Kishor: ప్రశాంత్ కిశోర్‌ అనుమానాలకు రాహుల్ ఓ కారణం..!

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కోసం అధిష్ఠానం తీసుకుంటోన్న నిర్ణయాల పట్ల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు అనుమానాలున్నాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

Published : 28 Apr 2022 01:27 IST

దిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కోసం అధిష్ఠానం తీసుకుంటోన్న నిర్ణయాల పట్ల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు అనుమానాలున్నాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌, ప్రశాంత్ మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతోన్న చర్చలు విఫలమైన తరుణంలో ఈ మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం రాహుల్ గాంధీయేనని తెలుస్తోంది.  

కాంగ్రెస్ వర్గాలు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రణాళికకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. అమలు విషయంలోకి వచ్చేసరికి ఆ స్థాయి ఆసక్తిని ప్రదర్శించడం లేదని ఆయన భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ రూపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటన పీకే అనుమానాలకు ఆజ్యం పోసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధిష్ఠానంలో కీలక వ్యక్తి అయిన రాహుల్ ముందుండి నడిపించాల్సిన సమయంలో దూరంగా ఉన్నారు. పార్టీ కోసం తన పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం విదేశాలకు వెళ్లేందుకే మొగ్గుచూపారన్నాయి. ఒకవైపు రాహుల్ నిర్లిప్తత ప్రదర్శిస్తున్నప్పటికీ.. ప్రియాంక మాత్రం పార్టీ విషయంలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని పేర్కొన్నాయి. ఇక పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం అన్ని చర్చల్లో పాల్గొన్నారు. పీకే ప్రణాళికను కాంగ్రెస్‌ నేతలు అంగీకరించినట్లే కనిపించిన్పటికీ.. పీకే అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరడం లేదన్న ప్రకటనలు వెలువడ్డాయి. 

ఇదిలా ఉండగా.. తమతో చేరడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా పార్టీ తలుపులు, కిటికీలు తెరిచే ఉంటాయని ఈ రోజు కాంగ్రెస్‌ నేత పవన్ ఖేరా మీడియాతో అన్నారు. అలాగే కార్యకర్తలు, నేతల ఆకాంక్షలకు తగ్గట్టుగా పార్టీలో మార్పులు చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని