Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కి గాయం.. పాదయాత్రకు బ్రేక్‌!

రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) కాలికి గాయమయ్యింది. దీంతో తాను చేపట్టిన పాదయాత్రకు కొన్నిరోజులపాటు విరామం ప్రకటించారు.

Published : 15 May 2023 17:32 IST

పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) అనారోగ్యానికి గురయ్యారు. కాలికి గాయం కారణంగా తాను చేపట్టిన ‘జన్‌ సురాజ్‌’ పాదయాత్రకు (Padayatra) తాత్కాలికంగా బ్రేక్‌ వేస్తున్నట్లు వెల్లడించారు. కాలి కండరం చిట్లిపోవడంతో కొన్ని రోజులపాటు పాదయాత్రను కొనసాగించలేకపోతున్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు కొంత విరామం తీసుకుంటున్నానని.. త్వరలోనే తిరిగి యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. గతేడాది గాంధీ జయంతి రోజున ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌ వ్యాప్తంగా పాదయాత్రకు బయలుదేరిన విషయం తెలిసిందే.

‘నాకు ఇతర అనారోగ్య సమస్యలు లేవు. పాడైన రోడ్లపై సుదీర్ఘ దూరం నడవడంతో ఎడమ కాలికి గాయం అయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అయినప్పటికీ విరామం తీసుకునేందుకు నిరాకరించాను. కానీ, పాదయాత్ర చాలా నెలలు జరగాల్సి ఉన్నందున కొన్నిరోజులు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదే ఉత్సాహంతో మరో 15రోజుల్లో యాత్ర మళ్లీ ప్రారంభం అవుతుంది’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

గతేడాది గాంధీ జయంతి (Gandhi Jayanti)న ‘జన్‌ సూరజ్‌’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500కి.మీ మేర కొనసాగనుంది. అయితే, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే అని చెబుతున్నా, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు సమాచారం. తొలుత ఈ యాత్రకు అంతగా ప్రజాదరణ లేనప్పటికీ ఇటీవల జరిగిన మండలి ఉపఎన్నికలో కిశోర్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఎంతోమంది రిటైర్డు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రశాంత్‌ కిశోర్‌కు  ఇటీవల తోడుగా నిలుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు