Prashant Kishor: కరోనా ఉద్ధృతి వేళ.. ఎన్నికల నిర్వహణకు అదొక్కటే సురక్షిత మార్గం

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు లక్షకు పైగా కొత్త కేసులు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. మరోపక్క కొద్ది వారాల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Published : 08 Jan 2022 01:32 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు లక్షకు పైగా కొత్త కేసులు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. మరోపక్క కొద్ది వారాల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయంటూ ఎన్నికల సంఘం వాటి నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ కరోనా ఉద్ధృతి వేళ.. ఒకే ఒక్క సురక్షితమైన మార్గం ఉందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. 

‘ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కనీసం 80 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకొని ఉండాలని ఎన్నికల సంఘం కచ్చితంగా పట్టుబట్టాలి. తీవ్ర స్థాయిలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు ఇదొక్కటే సురక్షితమైన మార్గం. ఎవరూ అనుసరించిన కొవిడ్ నియమావళి అంతా ఓ ప్రహసనం మాత్రమే’ అంటూ ప్రశాంత్ ట్వీట్ చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించలేదు. అలాగే ఆ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు, టీకా కవరేజీపై నిన్న కేంద్రంతో చర్చించింది. కేసులు పెరుగుతున్న తరుణంలో అర్హులకు అధిక సంఖ్యలో టీకాలు అందేలా చూడాలని కేంద్రానికి సూచించినట్లు తెలుస్తోంది. 

దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. నిన్న 15,13,377 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 1,17,100 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ ఉద్ధృతిలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని