Precaution Dose: ప్రికాషన్‌ డోసు పంపిణీ షురూ.. రెండు డోసులు ఏ టీకా వేసుకుంటే అదే..

కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్‌(ముందు జాగ్రత్త)

Updated : 10 Jan 2022 16:16 IST

దిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్‌(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేటి నుంచి ఈ డోసు వేస్తున్నారు. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచే కొవిన్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లను ప్రారంభించారు. నేటి నుంచి టీకా కేంద్రానికి వెళ్లి కూడా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ తెలిపింది. 

ప్రికాషన్‌ డోసుకు మిక్స్‌డ్‌ వ్యాక్సినేషన్‌ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ డోసుకు అర్హులైన వారు తొలి రెండు డోసులు ఏ టీకానైతే తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా తీసుకోవాలని తెలిపింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత ప్రికాషన్‌ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. ఈ డోసు కోసం వైద్యుల ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనాల మేరకు.. 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 2.75 కోట్ల సీనియర్‌ సిటిజన్లు ఈ అదనపు డోసును పొందనున్నారు. ఇప్పటికే వీరికి ప్రికాషన్‌ డోసుల గురించి మెసేజ్‌లు పంపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిన్న ట్విటర్‌లో వెల్లడించారు. ఇక, మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణించి వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో వారికి కూడా నేటి నుంచి ఈ డోసును పంపిణీ చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని