Modi in JK: జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు షురూ - ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలు మొదలయ్యాయని.. ఈ కేంద్రపాలిత ప్రాంతం త్వరలోనే రాష్ట్ర హోదాను కూడా పొందనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 21:36 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం త్వరలోనే రాష్ట్ర హోదాను కూడా పొందనుందని అన్నారు. శ్రీనగర్‌లో రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. శత్రువులకు తగిన సమయంలో దీటైన సమాధానం ఉంటుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న డాల్‌ సరస్సు వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అడ్డుగోడ తొలగిపోయిందని.. రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని అన్నారు. భారత్‌ రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతోందన్నారు. ఇక్కడ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం గత పదేళ్లుగా కృషి చేస్తోందన్నారు. గడిచిన శతాబ్దంలో దేశం అస్థిర ప్రభుత్వాలను చూసిందని.. పదేళ్లలో ఐదుసార్లు సాధారణ ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రపంచానికి భారత్‌ బలమైన సందేశం ఇచ్చిందన్నారు.

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొందని.. తద్వారా వారు ప్రజాస్వామ్య విజయాన్ని సాధించారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 2000 మంది స్థానిక యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఇక్కడ శాంతి, అభివృద్ధికి విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని.. వాటిని సాగనివ్వమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని