Kejriwal: మోదీజీ.. 14వేలు కాదు.. 10లక్షల పాఠశాలలను నవీకరించండి..!

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను నవీకరించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Published : 06 Sep 2022 21:12 IST

సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను నవీకరించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆయన.. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలోని 10లక్షల పాఠశాలలను ఆధునీకరించాలన్నారు. పీఎం-శ్రీ యోజన (PM SHRI Yojana)  కింద దేశంలోని 14,500 పాఠశాలల్లో ల్యాబ్‌లు, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ల వంటి ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘14,500 పాఠశాలలను ఆధునీకరిస్తామని ప్రధాని మోదీ (Narendra Modi) ప్రకటించడం మంచి విషయం. అయితే, ఈ సంఖ్య సముద్రంలో నీటి బిందువులాంటిది. ఈ లెక్కన దేశంలో ఉన్న 10.5లక్షల పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే మరో 70-80ఏళ్లు పడుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న పదిన్నర లక్షల ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రాల భాగస్వామ్యంతో నవీకరించేందుకు ఓ ప్రణాళిక రూపొందించండి’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  దేశంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన, ఉచిత విద్య (Quality Education) అందించనంతవరకు ప్రపంచంలో భారత్‌ నంబర్‌ 1 దేశం కాలేదన్నారు. భారత్‌ స్వాతంత్య్రం  పొందిన తర్వాత చాలా పెద్ద తప్పిదం జరిగిందన్న ఆయన.. దేశంలో ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సింది అన్నారు. ప్రతిఒక్కరూ విద్యావంతులైతే భారత్‌ పేద దేశంగా ఉండేది కాదని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకుల వల్లే భారత్‌ అభివృద్ధి చెందలేదని ఆరోపించిన కేజ్రీవాల్‌.. ప్రజలు ఏకమై ఒక కుటుంబంగా, బృందంగా పనిచేస్తే తప్ప మార్పు రాదన్నారు. ఒకవేళ ప్రజలే ఏకమైతే ప్రపంచంలోనే నంబర్‌ 1గా ఎదగడంలో భారత్‌ను ఏ శక్తి కూడా ఆపలేదని ఉద్ఘాటించారు. భారత్‌ను ప్రపంచంలోనే నంబర్‌ 1 దేశంగా మార్చే లక్ష్యంతో ఆమ్‌ఆద్మీపార్టీ ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా హరియాణాలోని హిసార్‌ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి.. తర్వాత అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని