CJI: కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్ నియామకం

భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ .....

Updated : 10 Aug 2022 18:24 IST

దిల్లీ: భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌. ఎన్‌.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును ఆయన సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం యు.యు.లలిత్‌ను భారత 49వ సీజేఐగా నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు.  అయితే, ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆగస్టు 27న యు.యు.లలిత్‌ నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఆయన కేవలం మూడు నెలలకన్నా తక్కువ సమయమే సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్‌ 8తో జస్టిస్‌ యు.యు.లలిత్‌కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే అందుకు కారణం. 

బార్‌ కౌన్సిల్‌ నుంచి సీజేఐ స్థాయికి..
సీనియర్‌ న్యాయవాది యు.యు.లలిత్‌ 2014 ఆగస్టు 13న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సీజేఐగా బాధ్యతలు చేపడితే బార్‌ నుంచి ఆ స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదిస్తారు. ఇదివరకు 1971 జనవరిలో 13వ సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ సైతం ఇలాగే బార్‌ నుంచి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ యు.యు.లలిత్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజుల స్వల్పకాలం మాత్రమే కొనసాగుతారు. నవంబర్‌ 8న పదవీ విరమణ చేస్తారు. ఆయన తండ్రి యూఆర్‌ లలిత్‌కూడా సీనియర్‌ న్యాయవాది, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2019లో జస్టిస్‌ లలిత్‌ అయోధ్య కేసు విచారణ నుంచి వైదొలిగారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన తరఫున వాదించిన ఉదంతాన్ని చూపుతూ ఆయన ధర్మాసనం నుంచి వైదొలిగారు. ఇటీవల తాను సుమోటోగా చేపట్టిన కేసులో మరణశిక్షలను తగ్గించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. త్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. శ్రీపద్మనాభస్వామి ఆలయ పరిపాలన బాధ్యతలను ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం నుంచి కోర్టు నియమించిన పరిపాలన కమిటీకి అప్పగించాలని తీర్పు చెప్పిన ధర్మాసనానికి నేతృత్వం వహించారు. 

వస్త్రాలపై తాకితే లైంగికదాడి కిందికి రాదని, దానికి ‘స్కిన్‌ టు స్కిన్‌’ సంబంధం ఉండాలని బాంబే హైకోర్టు నాగ్‌పుర్‌ ధర్మాసనం ఇచ్చిన వివాదాస్పద తీర్పును కొట్టేయడంతోపాటు, లైంగిక వ్యామోహంతో చిన్న పిల్లలతో ఎలాంటి భౌతిక సంబంధం పెట్టుకున్నా పోక్సో చట్టం ప్రకారం నేరం కిందికే వస్తుందని, నేరుగా శరీరాన్నే తాకాల్సిన అవసరం ఉండదని ఆయన నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక న్యాయవాదిగా యు.యు.లలిత్‌ ఎన్నో ఉన్నతస్థాయి క్రిమినల్‌ కేసులు వాదించారు. 2011లో 2జీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు లలిత్‌ను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 1957 నవంబర్‌ 9న జన్మించిన ఆయన 1983 జూన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 1986 జనవరి నుంచి దిల్లీకి మారారు. 2004లో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఎన్నో కేసుల్లో న్యాయ సహాయకుడిగా సేవలందించారు. సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యుడిగా రెండుసార్లు పనిచేశారు. ప్రస్తుతం జాతీయ న్యాయసేవల ప్రాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని