Vice chancellor: 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు కొత్త వీసీలు

దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొత్త వీసీల జాబితాను విడుదల.....

Updated : 23 Jul 2021 19:34 IST

దిల్లీ: దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొత్త వీసీల జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా డాక్టర్‌ బీజే రావు నియమితులు కాగా.. మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్‌ సయ్యద్‌ అన్యుల్‌ హసన్‌కు అవకాశం లభించింది. అలాగే, హరియాణా సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ టంకేశ్వర్‌ కుమార్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ సత్‌ప్రకాశ్‌ బన్సల్‌, జమ్మూ సెంట్రల్‌ వర్శిటీకి డాక్టర్‌ సంజీవ్‌ జైన్‌, ఝార్ఖండ్‌ సెంట్రల్‌ వర్సిటీకి ప్రొఫెసర్‌ క్షితిభూషణ్‌ దాస్‌, కర్ణాటక సెంట్రల్‌ వర్సిటీకి ఓయూ విశ్రాంత ప్రొఫెసర్‌ బట్టు సత్యనారాయణ, తమిళనాడు సెంట్రల్‌ వర్సిటీకి ప్రొఫెసర్‌ ముత్తుకళింగన్‌ కృష్ణన్‌, దక్షిణ బిహార్‌ సెంట్రల్‌ వర్సిటీకి ప్రొఫెసర్‌ కామేశ్వర్‌ నాథ్‌ సింగ్‌, నార్త్‌ ఈస్ట్‌ హిల్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ ప్రభ శంకర్‌ శుక్లా, గురు ఝాసిందాస్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ అలోక్‌ కుమార్‌ ఛక్రవాల్‌, మణిపూర్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ ఎన్‌.లోకేంద్ర సింగ్‌లను నియమించారు.

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 22 వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిలో 12 ఖాళీల భర్తీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నిన్న రాజ్యసభకు తెలిపారు. 

హెచ్‌సీయూ కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ బసుత్కర్ జగదీశ్వర్ రావు (బీజే రావు) ప్రస్తుతం తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జీవశాస్త్రం విభాగాధిపతిగా ఉన్నారు. నిజాం కాలేజీలో బీఎస్సీ, ఓయూలో ఎమ్మెస్సీ, బెంగళూరులోని ఐఐఎస్‌లో పీహెచ్ డీ చేశారు. హెచ్‌సీయూ వీసీగా బీజే రావు ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులు కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని