President of India: దేశం ఆశలన్నీ వారిపైనే.. జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయ్‌.. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు......

Updated : 14 Aug 2022 20:03 IST

దిల్లీ: దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయ్‌.. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశానికి అతి పెద్ద ఆశాదీపాలు మన పుత్రికలేనన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రలజందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.  భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమన్నారు. ‘‘భారత్‌ 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోంది. 1947 ఆగస్టు 15న వలస పాలన సంకెళ్లను తెంచుకున్నాం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. మన స్వాతంత్ర్య సమరయోధులందరికీ వందనాలు. మనమంతా  స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం వారంతా తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా మన మహనీయులందరినీ మరోసారి స్మరించుకుందాం. దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న  స్మృతి దివస్‌ జరుపుకొంటున్నాం. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నాం’’ అని ఆమె అన్నారు.

దేశం నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది..
ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. దేశ ప్రజలు స్వాతంత్ర్య వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశ నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.  ప్రజాస్వామ్య సామర్థ్యం వెలికి తీడయంలో, దాన్ని ప్రపంచానికి చూపడంలోనూ భారత్‌ సత్తా చాటింది. భారత్‌ అనేక రకాల వైవిధ్యంతో నిండి ఉంది. మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది. అదే మనందరినీ ఒక్కటిగా కలుపుతోంది. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తితో కలిసి నడవడానికి ప్రేరేపిస్తోంది. 

డిజిటల్‌ విధానంతో పెనుమార్పులు

‘‘కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఈ క్లిష్ట సమయాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే భారత్‌ ఓ మార్గదర్శిలా నిలిచింది. అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టి వ్యాక్సినేషన్‌లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. అంకుర సంస్థలతో భారత్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ విధానం పెనుమార్పులు తీసుకొచ్చింది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నాం. దేశంలో స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ను చేపట్టాం. గత నెలలో 200 కోట్ల వ్యాక్సిన్‌ మార్కును అధిగమించాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌ సాధించిన విజయాలు ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువే.

సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు!

‘‘మన మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో పెరుగుతోన్న వారి భాగస్వామ్యం నిర్ణయాత్మకంగా మారింది. నేడు మన పంచాయతీరాజ్ సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య పద్నాలుగు లక్షలకు పైనే. దేశం ఆశలన్నీ మన పుత్రికలపైనే ఉన్నాయి. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే గొప్ప విజయాలు సాధించగలరు. ఫైటర్‌ పైలట్‌ నుంచి అంతరిక్ష శాస్త్రవేత్త దాకా.. మన పుత్రికలు ప్రతిరంగంలోనూ విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని