Lok Sabha: ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి ప్రమాణం.. కాసేపట్లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం

Lok Sabha: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 

Updated : 24 Jun 2024 11:39 IST

దిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. నూతన లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ (Pro-tem Speaker)గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha Session) ప్రారంభం కానుంది. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది.

ఇదిలా ఉండగా.. ప్రొటెం స్పీకర్‌కు సహకారం అందించేలా నియమితులైన ముగ్గురు సభ్యులు ఆ ప్యానెల్‌లో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక జరిగేటంత వరకు కె.సురేశ్‌ (కాంగ్రెస్‌), టి.ఆర్‌.బాలు (డీఎంకే), సుదీప్‌ బందోపాధ్యాయ్‌ (తృణమూల్‌) ఈ ప్యానెల్‌లో ఉండేలా వారిని నియమించారు. అయితే, భర్తృహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని అంగీకరించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి.

కిరణ్‌ రిజిజు వెల్‌కమ్‌.. కాంగ్రెస్‌ కౌంటర్‌

ఇదిలాఉండగా.. 18వ లోక్‌సభ తొలి సమావేశాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. నూతనంగా ఎన్నికైన ఎంపీలను సభకు సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సమన్వయంతో సభను నడుపుదామని ఆకాంక్షించారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ స్పందించారు. ‘‘చెప్పే పదాల కంటే చేసే పనులే గట్టిగా మాట్లాడుతాయి. మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి మినిస్టర్‌’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని