వారందరికీ సెల్యూట్‌ చేయాలి: రాష్ట్రపతి

దేశంలోని ప్రతి భారతీయుడూ రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతన్న సాగులో వెనకడుగు వేయలేదన్నారు. వారి కృషి వల్లే దేశం ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి......

Published : 25 Jan 2021 20:51 IST

దిల్లీ: దేశంలోని ప్రతి భారతీయుడూ రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతన్న సాగులో వెనకడుగు వేయలేదన్నారు. వారి కృషి వల్లే దేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని రాష్ట్రపతి అన్నారు. అలాంటి రైతుల సంక్షేమం కోసం దేశం పూర్తి నిబద్ధత కలిగి ఉందన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

దేశానికి రైతులు ఆహార భద్రత అందిస్తుంటే... సైనికులు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. గడ్డ కట్టే చలి నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని దేశ రక్షణకు పాటుపడుతున్నారని కొనియాడారు. అలాగే కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు మన శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మరణాలు తగ్గించడానికి కృషి చేశారని చెప్పారు. దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ దేశ ప్రజలంతా రైతులు, సైనికులు, శాస్త్రవేత్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

విపత్తుల సమయంలోనూ బిహార్‌ వంటి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ఈసీ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. అలాగే ఇటీవల కాలంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందనడానికి నిదర్శమన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పిలుపునిచ్చారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ 2022 నాటికి నవ భారతాన్ని నిర్మించాలన్న ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని చెప్పారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ భారతదేశం సమగ్రత, సుస్థిరతల సమ్మేళనంగా అన్ని మార్గాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. మన ప్రజాస్వామ్యం సచేతనమైనదని, సుపరిపాలన, పారదర్శకత పట్ల మన నిబద్ధత మరింత బలంగా వేళ్లూనుకుందని చెప్పారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ నాగరిక ఆదర్శాలకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడేందుకు ప్రతిజ్ఞ చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సమగ్రమైన, శాంతియుతమైన, సామరస్య పూర్వక, ప్రగతిశీల భారత నిర్మాణానికి పునరంకితమౌదామని పిలుపునిచ్చారు. మన గణతంత్రం సాధించిన విజయాలను మరోసారి గుర్తు తెచ్చుకుందామన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, సమగ్ర అభివృద్ధికి దోహదపడే సనాతన సంప్రదాయాలను కొనసాగించే దిశగా మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన ఆత్మనిర్భర భారతావనిని నిర్మించే దిశగా అంకితమయ్యేందుకు సంకల్పం తీసుకుందామని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

దేశవ్యాప్తంగా 19.5 లక్షల మందికి వ్యాక్సిన్‌

గణతంత్ర వేడుకలకు మొబైల్‌ యాప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని