
దేశ మహిళలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్లో పోస్టు చేశారు. ‘ దేశంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనదేశంలో మహిళలు విభిన్న రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. స్త్రీ, పురుష అసమానతల్ని నివారించడానికి మనందరం సమష్టిగా కృషి చేయాలి’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
వివక్షను అంతం చేద్దాం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ట్విటర్లో పోస్టు చేశారు. ‘దేశ నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై వివక్షను అంతం చేసి, తగిన గౌరవాన్ని అందించి వారి హక్కులను కాపాడతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేద్దాం’ అని వెంకయ్య ట్వీట్లో వెల్లడించారు.
మోదీ అభినందనలు
విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాల పట్ల మనదేశం ఎంతో గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులందరికీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు వందనం. మహిళలు సాధిస్తున్న విజయాల పట్ల దేశం గర్విస్తోంది. అనేక రంగాల్లో మహిళా సాధికారత దిశగా పనిచేసే అవకాశం లభించడం మా ప్రభుత్వానికి ఎంతో గౌరవం’ అని మోదీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.