Petrol price: ‘పెట్రో మంట’ భయాలతో ముందుగానే ట్యాంకులు నింపేశారు!

పెట్రో, డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న భయాలతో డీలర్లు, వాహనదారులు ముందుజాగ్రత్తగా తమ ట్యాంకులను నింపుకున్నారు.

Published : 17 Mar 2022 01:16 IST

మార్చి తొలిపక్షంలో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ధరలు మరింత పెరగవచ్చనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న భయాలతో డీలర్లు, వాహనదారులు ముందుజాగ్రత్తగా తమ ట్యాంకులను నింపుకొన్నారు. దీంతో నెల ప్రారంభంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్రో ధరలపై రాజకీయ నేతలు చేసిన ప్రకటనలతో చమురు మంట భయాలు వినియోగదారులను వెంటాడినట్లు తెలుస్తోంది.

గణాంకాల ప్రకారం..  మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1.23 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 18 శాతం పెరుగుదల కనిపించగా.. అంతకుముందు ఏడాది (2019) కంటే 24.4 శాతం ఎక్కువ. ఇక దేశంలో ఎక్కువగా వినియోగించే డీజిల్‌ కూడా 3.53 మిలియన్‌ టన్నుల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 23.7 శాతం పెరుగుదల కనిపించింది. ఇక నెలవారీ వినియోగంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. క్రితంనెల తొలి పదిహేను రోజులతో పోలిస్తే మార్చి తొలిపక్షంలో పెట్రోల్‌ 18.8 శాతం పెరగ్గా.. డీజిల్‌ వినియోగం 32.8శాతం పెరిగింది.

నాయకుల ప్రకటన వల్లే..

దేశంలో ఇంధన వినియోగం పెరగడంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ ఇటీవలే స్పందించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల భయంతోనే వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇలా ముందస్తుగా వాహన ట్యాంకులను నింపుకోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం ఒక్కసారిగా 20 శాతం పెరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ‘ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌ ధరలు పెరగనున్నాయ్‌.. అందుకే ఇప్పుడే మీ వాహన ట్యాంకులను నింపుకోండి’ అని మార్చి 5వ తేదీన రాహుల్‌ గాంధీ చెప్పడం వల్లే 20 శాతం వినియోగం పెరిగిందని పెట్రోలియంశాఖ మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్వరలోనే ఎలక్షన్‌ ఆఫర్‌ ముగుస్తుందని రాజకీయ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటని కేంద్రమంత్రి విమర్శించారు.

అందుకే ధరలు పెరగడం లేదా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపించిన దగ్గర నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు కళ్లెం పడింది. అంతకుముందు రోజువారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి వెళ్లిన ఇంధన ధరలు.. దాదాపు 132 రోజుల పాటు పెరగలేదు. క్రూడాయిల్‌ ధర పెరిగినప్పటికీ వీటిని పెంచకపోవడం గమనార్హం. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరల్లో దాదాపు రూ.12 పెరగవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయినప్పటికీ పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఇంధన ధరలను పెంచకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని