రైతు గుండెల్లో పేలనున్న ఎరువు ధరల బాంబు!

అహర్నిషలు శ్రమించినా అప్పులతో సహవాసం చేసే అన్నదాతలపై మరో పిడుగు పడనుంది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటిన వేళ వ్యవసాయంలో కీలకమైన రసాయన ఎరువుల ధరల పెంపు పరిణామాలు శరాఘాతంగా కనిపిస్తున్నాయి....

Published : 12 Mar 2021 18:23 IST

50 కిలోల బస్తాపై రూ.100 నుంచి రూ.250 పెంపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అహర్నిశలు శ్రమించినా అప్పులతో సహవాసం చేసే అన్నదాతలపై మరో పిడుగు పడనుంది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటిన వేళ వ్యవసాయంలో కీలకమైన రసాయన ఎరువుల ధరల పెంపు పరిణామాలు శరాఘాతంగా కనిపిస్తున్నాయి. 50 కిలోల బస్తాపై రూ.250 దాకా పెంచడంపై రైతులు, రైతు సంఘాల్లో నిరసన వ్యక్తమవుతోంది. నానాటికీ పెట్టుబడి వ్యయం పెరిగిపోతూ సేద్యమే పెనుభారంగా మారుతున్న సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలు కల్పించకుండా.. ఎరువుల ధరల రూపంలో భారం మోపడం తగదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

లాభాల మాట పక్కన పెడితే..రాత్రీ, పగలు తేడా లేకుండా కష్టించే రైతన్నలకు శ్రమకు తగిన ఫలితం కూడా దక్కడం లేదు. ఏడాదంతా సేద్యం చేసినా లెక్కలు చూస్తే పెట్టుబడి కూడా తిరిగిరాని దుస్థితి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలపై ఎరువుల రూపంలో మరింత భారం పడనుంది. క్రమం తప్పకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల సరసన సాగుకు వినియోగించే రసాయన ఎరువులు వచ్చి చేరాయి. 50 కిలోల ఎరువుల బస్తాపై దేశవ్యాప్తంగా రూ.100 నుంచి రూ.250 వరకు పెంపుదలకు రంగం సిద్ధమైంది. కొన్ని సంస్థలు ఇప్పటికే ధరలు పెంచేశాయి కూడా. మరికొన్ని సంస్థలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ప్రస్తుతమున్న పరిస్థితులు గమనిస్తే.. 20:20:0 రకం ఎరువుల బస్తా ఆదివారం వరకు రూ.890 చొప్పున విక్రయించగా సోమవారం నుంచి రూ.998 అయ్యింది. ఈ ఎరువు గరిష్ఠ చిల్లర ధర రూ.975 నుంచి రూ.1125కు చేరింది. కొన్ని కంపెనీల డీఏపీ ధరలు కూడా రూ.1275 నుంచి రూ.1450కు చేరుకున్నాయి. 10:25 రకం ఎరువుల బస్తా సైతం రూ.150 పెరిగి అన్నదాతపై ఆర్థిక భారం మోపుతోంది. కాగా ఈ పెరుగుదలను రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాల్పడకుండా వారిపై ఆర్థిక భారం మోపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడండి
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని