Manipur: మణిపుర్‌లో అల్లర్ల ఎఫెక్ట్‌.. వంటగ్యాస్‌ ధర ₹1800.. పెట్రోల్‌ రూ.170

Price Rise in Manipur: మణిపుర్‌లో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.170గా ఉండగా.. సిలిండర్‌ ధర ఏకంగా రూ.1800 దాటేసింది. అల్లర్ల ఎఫెక్ట్‌తో సరఫరా తగ్గి వీటి ధరలు అమాంతం పెరిగాయి.

Published : 25 May 2023 01:47 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అల్లర్ల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను రాష్ట్రానికి నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో సరఫరాకు అంతరాయం కలగడంతో పలు వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. (Price Rise in Manipur)

అల్లర్లు చోటుచేసుకున్న ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ లోయ సహా పలు ప్రాంతాల్లో బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతకుముందు 50కిలోల బియ్యం (Rice) ధర రూ.900గా ఉండగా.. ఇప్పుడు రూ. 1800లకు చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటగ్యాస్‌ సిలిండర్ల (LPG Cylinder) సరఫరా ఆగిపోవడంతో బ్లాక్‌మార్కెట్‌ పెరిగిపోయింది. ఒక్కో సిలిండర్‌ ధర రూ.1800లకు పైనే ఉండటం గమనార్హం. ఇక, రాజధాని ఇంఫాల్‌లోని చాలా చోట్ల లీటర్‌ పెట్రోల్‌ (Petrol) ధర రూ.170కు పెరిగింది. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10కి చేరగా.. కిలో బంగాళదుంపల ధర రూ.100గా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు.

మెయిటీ, కుకీ తెగల మధ్య మే 3వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణలతో మణిపుర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతలను అదుపుచేసేందుకు కేంద్రం ఆర్మీ, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. ఇటీవల ఈ పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లే కన్పించినా.. గత సోమవారం నుంచి మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆంక్షలు విధించడంతో పాటు, కేంద్ర బలగాలను మోహరించారు. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని