Published : 11 Nov 2021 10:51 IST

Prince Harry: ‘క్యాపిటల్‌ హిల్‌’ దాడి గురించి ముందే హెచ్చరించిన ప్రిన్స్‌ హ్యారీ!

వాషింగ్టన్‌: ఈ ఏడాది జనవరిలో అమెరికా ‘క్యాపిటల్‌ హిల్‌’ భవనంపై జరిగిన దాడి యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారుల ముట్టడితో ఆ భవన పరిసరాలు అల్లకల్లోలంగా మారాయి. కాగా.. ఈ దాడి గురించి బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్‌ హ్యారీ.. ట్విటర్‌ సీఈవోను ముందే హెచ్చరించారట. ఈ విషయాన్ని హ్యరీనే స్వయంగా వెల్లడించారు. ట్విటర్‌ను వాడుకొని క్యాపిటల్‌ హిల్‌ పై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను ఆ కంపెనీ సీఈవోకు ఈ-మెయిల్ చేసినట్లు తెలిపారు. 

కాలిఫోర్నియాలో ‘రి:వైర్డ్‌’ పేరిట జరిగిన ఓ ఆన్‌లైన్‌ టెక్‌ సదస్సులో ప్రిన్స్‌ హ్యారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జనవరి 6వ తేదీకి ముందు నేను.. జాక్‌(ట్విటర్‌ సీఈవో జాక్ డోర్సేను ఉద్దేశిస్తూ) పరస్పరం ఈ-మెయిల్స్‌లో సంభాషించుకొన్నాం. ట్విటర్‌ తిరుగుబాటు కుట్రలను అనుమతిస్తోందని నేను ఆయన్ను హెచ్చరించాను. క్యాపిటల్‌ హిల్‌ పై దాడి జరగడానికి ఒక రోజు ముందే నేను ఈ విషయాన్ని ఈ-మెయిల్‌ కూడా చేశాను. కానీ, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు’’ అని హ్యారీ వెల్లడించారు. అయితే, దీనిపై స్పందించేందుకు ట్విటర్‌ నిరాకరించింది. ఈ సందర్భంగా ఇతర సోషల్‌మీడియా సంస్థలపై కూడా హ్యారీ విమర్శలు గుప్పించారు. కొవిడ్‌, పర్యావరణ మార్పులపై ఈ వేదికలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ కోట్లాది మందిని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. 

ఈ ఏడాది జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమవగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. బారికేడ్లు దాటుకొని, గోడలు ఎక్కుతూ భవనం లోపలికి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కొద్ది గంటల ముందు నాటి  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రసంగం చేశారు. బైడెన్‌ తన ఓట్లు దొంగలించి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాల్లో వైరల్‌ అయ్యాయి. 

దీంతో సామాజిక మాధ్యమాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయడంలో సోషల్‌ మీడియా సంస్థలు విఫలమయ్యాయని, అందుకే క్యాపిటల్‌ హిల్‌పై దాడి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. క్యాపిటల్‌ ఘటన తర్వాత ట్రంప్‌ ఖాతాల పై సోషల్‌మీడియా సంస్థలు వేటువేశాయి. ఆయనపై శాశ్వత నిషేధం విధించాయి. దీంతో ఇటీవల ట్రంప్‌ ‘ట్రూత్’ పేరుతో సొంతంగా సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts