Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల టీకా ఆర్డర్లు కొవిన్‌లోనే

ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయంటూ ఇటీవల పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు

Published : 30 Jun 2021 13:08 IST

నెలవారీ కొనుగోలుపైనా పరిమితులు విధించిన కేంద్రం!

దిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయంటూ ఇటీవల పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరాను తగ్గించి వృథాను అరికట్టేందుకు నెలవారీ కొనుగోళ్లపై పరిమితులు విధించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఇకపై ఈ ఆసుపత్రులు టీకాల కోసం కొవిన్‌ ద్వారా మాత్రమే ఆర్డర్లు పెట్టుకోవాలని, నేరుగా తయారీ సంస్థల నుంచి డోసులు కొనుగోలు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ నూతన మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీని ప్రకారం.. ప్రైవేటు ఆసుపత్రులు గత నెల సగటు వినియోగాన్ని బట్టి మాత్రమే తర్వాతి నెలకు డోసులను ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక ఆసుపత్రి జులై నెలకు టీకాలను ఆర్డర్‌ చేసుకోవాలంటే.. జూన్‌లోని ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోవాలి. ఆ ఏడు రోజుల సమయంలో ఆ ఆసుపత్రి మొత్తం 700 డోసులను వినియోగించినట్లయితే రోజువారీ సగటు 100 డోసులుగా ఉంటుంది. అప్పుడు జులై నెల కోసం ఆ హాస్పిటల్‌ గరిష్ఠంగా 100 డోసులు × 31(నెలలో మొత్తం రోజులు) × 2(సగటుకు రెట్టింపు).. మొత్తంగా 6,200 డోసులను ఆర్డర్‌ చేసుకోవచ్చన్నమాట. ఒకవేళ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ప్రైవేటు ఆసుపత్రులు తొలిసారిగా చేరితే.. అప్పుడు హాస్పిటల్‌లోని పడకల సంఖ్య ఆధారంగా టీకాలను కేటాయిస్తారు.

అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఈ మొత్తం టీకా సమాచారాన్ని కొవిన్‌ డేటాబేస్‌లో అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలు తయారీ సంస్థలకు అందిన తర్వాత డోసుల ఆర్డర్లు చేసుకునేందుకు వీలుంటుంది. ప్రవేటు ఆసుపత్రులు ఇకపై కేవలం కొవిన్‌ ద్వారా మాత్రమే టీకాలను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తయారీ సంస్థలకు ఆర్డర్లు పెట్టే అవకాశం లేదని సదరు కథనాలు పేర్కొన్నాయి. 

జూన్‌ 21 నుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్‌ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం.. వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి 75శాతం డోసులను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగతా 25 శాతం డోసులను ఉత్పత్తిదారులు నేరుగా ప్రైవేట్లో విక్రయించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే అధిక ధరల కారణంగా ప్రైవేట్‌లో టీకాకు స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. అక్కడ కేటాయించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో డోసుల పంపిణీ జరుగుతోంది. దీంతో ప్రవేటు ఆసుపత్రులకు 25శాతం టీకాలను కేటాయించడం చాలా ఎక్కువ అని, దాన్ని తగ్గించాలంటూ తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇటీవల కేంద్రానికి లేఖ రాశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని