
Mayawati: మాయావతి ఇంట విషాదం.. ప్రియాంక గాంధీ పరామర్శ
దిల్లీ: బీఎస్పీ అధినేత్రి, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి రామ్‌రతి(92) హార్ట్ ఫెయిల్యూర్‌తో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార సన్నాహాల్లో ఉన్న మాయావతి.. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఏడాది క్రితమే తండ్రి ప్రభుదయాళ్ తుదిశ్వాస విడవగా.. ఇప్పుడు తల్లి కన్నుమూయడంతో మాయావతి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు దిల్లీలో రామ్‌రతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆయా పార్టీల నేతల సంతాపం..
మరోవైపు బీఎస్పీ సహా ఆయా పార్టీల నేతలు మాయావతి తల్లి మరణంపై సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఆదివారం మాయావతిని దిల్లీలోని ఆమె నివాసంలో కలిసి, పరామర్శించారు. రామ్‌రతి భౌతికకాయానికి నివాళులర్పించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం ప్రకటించారు.