Nalini: ఆ విషయాలు తెలుసుకొని.. ప్రియాంక కన్నీటి పర్యంతమయ్యారు: నళిని

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవించిన నళిని శ్రీహరన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. 2008లో ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Published : 14 Nov 2022 01:14 IST

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi Assassination)లో మూడు దశాబ్దాల పాటు శిక్ష అనుభవించిన నళిని శ్రీహరన్‌తో సహా ఇతర దోషులు (Nalini Sriharan) జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన నళిని.. 2008లో ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తండ్రి మరణం రోజున ఏం జరిగిందనే విషయాలను ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారని.. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు.

‘2008లో వెల్లూరు సెంట్రల్‌ జైలులో ప్రియాంక గాంధీ నన్ను కలిశారు. ఆమె ఎంతో దయగల వ్యక్తి. ఆమె ఒక దేవత. ఆమె నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు. తన తండ్రి రాజీవ్‌ గాంధీ హత్య గురించి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురై ఏడ్చారు కూడా’ అని నళిని వెల్లడించారు. హత్య కేసులో పాత్రపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నళిని.. అందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. ఆ బృందంతో తనకు పరిచయం ఉన్న కారణంగా దోషిగా తేలానని.. అందుకు శిక్ష అనుభవించానన్నారు. అయినప్పటికీ, అసలు నిజమేంటో నా అంతరాత్మకే తెలుసునంటూ నళిని శ్రీహరన్‌ చెప్పారు.

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో శిక్ష పడి వేలూరు జైలులో ఉన్న నళిని, మురుగన్‌, సంథన్‌లు శనివారం విడుదల కాగా.. చెన్నై పుళల్‌ జైలు నుంచి రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌, తిరుచ్చి కారాగారం నుంచి రవిచంద్రన్‌లు విడుదలయ్యారు. వీరిలో మురుగన్‌, సంథన్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌లు శ్రీలంక జాతీయులు కావడంతో వారిని భారీ పోలీసు బందోబస్తుతో తిరుచ్చిలో ఉన్న శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలించారు. నళినిని మాత్రం చెన్నైలో ఉన్న ఆమె తల్లి వద్దకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని