Priyanka Gandhi: బారికేడ్లు దూకి ప్రియాంక గాంధీ ధర్నా.. బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతిభవన్‌, ప్రధాని

Published : 05 Aug 2022 16:32 IST

దిల్లీ: ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతిభవన్‌, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు హస్తం పార్టీ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆందోళనల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌ ఎక్కించడంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దేశ రాజధానిలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ నేడు పిలుపునివ్వగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాయలం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. కాంగ్రెస్‌ నేతలను ర్యాలీకి అనుమతించలేదు. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి దూకి రోడ్డుపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఇక్కడ నిషేదాజ్ఞలు ఉన్నందున ధర్నా చేయొద్దని పోలీసులు ఆమెకు సూచించారు. కానీ ఆందోళనను విరమించేందుకు ప్రియాంక ఒప్పుకోకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌ ఎక్కించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్‌ నేతలు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ఓ మహిళా నేత పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఆందోళనల సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..‘‘ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారు. అందుకే మేం ప్రధాని ఇంటి వరకూ వెళ్లి చూపించాలనుకుంటున్నాం. కానీ వారు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) మాపై దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.

అంతకుముందు పార్టీ ఎంపీలతో కలిపి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ భవనం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు మార్చ్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే విజయ్‌ చౌక్‌ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ప్రియాంక, రాహుల్‌ పోలీసుల అదుపులోనే ఉన్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు