Archana Gautam: అర్చనా గౌతమ్‌తో అసభ్య ప్రవర్తన.. ప్రియాంకా గాంధీ పీఏపై కేసు!

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్చనా గౌతమ్‌ (Archana Gautam)ను వేధించినట్లు అందిన ఫిర్యాదుపై ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పీఏపై కేసు నమోదయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 08 Mar 2023 14:38 IST

మేరఠ్‌: కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi) వ్యక్తిగత సహాయకుడు సందీప్‌ సింగ్‌పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్‌ బెదిరించినట్లు బిగ్‌బాస్‌ ఫేమ్‌, కాంగ్రెస్‌ నేత అర్చనా గౌతమ్‌ (Archana Gautam) తండ్రి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తనకు ఎదురైన ఘటనను వివరిస్తూ అర్చన కూడా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశారు. దీంతో ప్రియాంకా గాంధీ పీఏపై (PA) వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

‘ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారని.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగే పార్టీ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్‌ సింగ్‌ చెప్పాడు. అక్కడికి వెళ్లిన అర్చనతో సందీప్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతోపాటు ఆమెను చంపేస్తానని బెదిరించాడు’ అని మేరఠ్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదులో అర్చనా గౌతమ్‌ తండ్రి గౌతమ్‌ బుద్ధా పేర్కొన్నాడు. అంతేకాకుండా తన కుమార్తెను కులం పేరుతో దూషించాడని ఆరోపించాడు.

ప్రియాంకా గాంధీ వద్ద పనిచేసే సందీప్‌ సింగ్‌.. అర్చనా గౌతమ్‌ను బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని మేరఠ్‌ ఎస్‌ఎస్‌పీ రోహిత్‌ సింగ్‌ సాజ్వాన్‌ వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్లలతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కిందా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

మోడల్‌గా, నటిగా తన కెరీర్‌ మొదలుపెట్టిన అర్చనా గౌతమ్‌ బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా మరింత ఫేమస్‌ అయ్యారు. రాజకీయాల్లో చేరిన ఆమె.. మేరఠ్‌ ప్రాంతంలో పట్టున్న దళిత నేతగా కాంగ్రెస్‌లో గుర్తింపు పొందారు. అయితే, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినాపూర్‌ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని