Operation Bluestar: ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 39ఏళ్లు.. ఆ రోజున ఏం జరిగింది..?

అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో (Golden Temple) దాక్కున్న మిలిటెంట్లను బయటకు రప్పించేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ (Operation Blue Star) చర్యకు 39ఏళ్లు అయ్యింది.

Updated : 06 Jun 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన సైనిక చర్య (Operation Blue Star)కు నేటితో 39ఏళ్లు పూర్తయ్యాయి. ఆలయంలో దాక్కున్న మిలిటెంట్లను పట్టుకునేందుకు భారత సైన్యం (Indian Army) చేపట్టిన చర్య అది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83మంది భారత సైనికులు అమరులయ్యారు. అందులో వేర్పాటువాద నేతలూ హతమయ్యారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు.. దేశ చరిత్రలో ఓ మారణహోమానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’కు దారితీసిన పరిస్థితులు, సైనిక చర్యలో ఏం జరిగిందనే విషయాలను ఓసారి గుర్తుచేసుకుంటే..

భింద్రన్‌వాలే లక్ష్యంగా..

పంజాబ్‌లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్థాన్‌ ఉద్యమానికి దారితీసింది. 1980లో ఈ ఉద్యమం వివాదాస్పద నేత జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే (Jarnail Singh Bhidnrawale) సారథ్యంలో నడిచింది. ఇదే సమయంలో సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని భింద్రన్‌వాలే స్థావరంగా మార్చుకోవడం ఆందోళనలకు కారణమయ్యింది. తన అనుచరుల సహాయంతో అక్కడినుంచే పోలీసులపై దాడులు చేయిస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. దేవాలయం వద్ద డీఐజీ స్థాయి అధికారిని దుండగులు కాల్చి చంపడంతో పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉన్నట్లు కేంద్రం భావించింది. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యంతో సంప్రదింపులు జరిపి.. అందులో దాక్కున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాదులను నిర్బంధించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన భారత సైన్యం.. 1984 జూన్‌ 1న సైనిక చర్య మొదలుపెట్టింది. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’.. భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది.

రెండు విభాగాల్లో..

ఈ ఆపరేషన్‌ను రాత్రి పూట చేపట్టాలని భారత సైన్యం నిర్ణయించింది. దీన్ని ఆపరేషన్‌ మెటల్‌.. ఆపరేషన్‌ షాప్‌ అనే రెండు విభాగాల్లో చేపట్టారు. భింద్రన్‌వాలేతోపాటు అతడి అనుచరులని ఆలయం బయటకు తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్‌ మెటల్‌’ చేపట్టగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను అణచివేసేందుకు ఆపరేషన్‌ షాప్‌ను అమలు చేశారు. స్వర్ణదేవాలయంలో రాత్రి పదిగంటల సమయంలో భారత సైన్యం ఆపరేషన్‌ మొదలుపెట్టింది. కేవలం భింద్రన్‌వాలేతోపాటు అందులో దాక్కున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అక్కడి నుంచి ప్రతిదాడులు మొదలయ్యాయి. భారీ ఆయుధాలు, రాకెట్‌ లాంచర్లతో సైన్యంపై తెగబడ్డారు. ఊహించని పరిణామంతో సైన్యం ఎదురుదాడులకు దిగాల్సి వచ్చింది. ఇలా జూన్‌ 1న మొదలైన ఈ ఆపరేషన్‌.. 8వ తేదీవరకు కొనసాగింది. తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో జూన్‌ 3న రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. చివరకు జూన్‌ 5 రాత్రి కీలక ఆపరేషన్‌ను మొదలుపెట్టిన భారత సైన్యం.. మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగించింది. భింద్రన్‌వాలేతో పాటు ఇతర ఉగ్రవాదులను సైన్యం మట్ట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో మొత్తంగా ఇందులో 83 మంది భారత సైనికులు అమరులు కాగా.. మరో 236మంది గాయపడ్డారు. 493 మంది వేర్పాటువాదులు, పౌరులు మరణించగా.. సుమారు 500 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, ఈ ఆపరేషన్‌ జరిగిన నాలుగు నెలలకే (1984 అక్టోబర్‌ 31న) ఇద్దరు సిక్కు బాడీగార్డుల చేతిలో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు సిక్కుల ఊచకోతకు దారితీసింది. ఇందులో ఆ వర్గానికి చెందిన వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఖలిస్థాన్‌ మద్దతుదారుల నిరసన..

ఈ ఘటన జరిగి 39 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతిఏటా స్వర్ణ దేవాలయం సమీపంలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు నిరసన తెలుపుతూనే ఉంటారు. ఈ క్రమంలో మంగళవారం కూడా భారీ స్థాయిలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు ఆలయ సమీపానికి చేరుకొని నినాదాలు చేశారు. దల్‌ఖాల్సా నేతృత్వంలో వందల మంది సిక్కు యువకులు అక్కడకు చేరుకొని ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ఇటీవలే అమృత్‌పాల్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిన ఈ నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. వేల మంది పోలీసులను రంగంలోకి దించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని