Updated : 23 Jul 2021 15:09 IST

China: తీరు మార్చుకోని చైనా.. అణు విద్యుత్‌పైనా అదే వైఖరి

ఇంటర్నెట్‌డెస్క్‌: గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని తైషాన్‌ అణు విద్యుత్తు కర్మాగారం నిర్వహణలో చైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది. రేడియేషన్‌ లీకైనట్లు తేలినా ఇప్పటికీ ఆ ప్లాంట్‌ను కొనసాగిస్తోంది. అప్పట్లో ఇదేం తీవ్రమైంది కాదని చైనా అధికారులు కొట్టిపారేశారు. కానీ, వారు వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అణువిద్యుత్తు కర్మాగారానికి ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రామాటోమ్‌ సహభాగస్వామి. ఎలక్ట్రిసిటీ డె ఫ్రాన్స్‌ దీని మాతృ సంస్థ.

అధికారం తమ చేతిలో ఉంటే భద్రతా ప్రమాణాల ప్రకారం ఈ పాటికి ఆ ప్లాంట్‌ను మూసివేసే వారమని ఎలక్ట్రిసిటీ డె ఫ్రాన్స్‌ ప్రతినిధి నేడు తెలిపారు. అక్కడ అత్యవసర పరిస్థితి లేదు గానీ.. సమస్య తీవ్రత ఎక్కువగానే ఉందని తెలిపారు. ఆ రీయాక్టర్‌ ఫ్రాన్స్‌లో ఉంటే ఇప్పటికే మూసివేసేవారమని పేర్కొన్నారు. కానీ, నేరుగా మాత్రం చైనా జనరల్‌ న్యూక్లియర్‌ పవర్‌ గ్రూపునకు ఎలాంటి సూచన చేయలేదు. ఆ ప్లాంట్‌లో మెజారిటీ వాటా సీజీఎన్‌ సంస్థదే.

కర్మాగారం బయటకు రేడియేషన్‌..

ఈ కర్మాగారం మూసివేత విషయంలో చైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రేడియేషన్‌ వ్యాప్తి పరిధి పెరిగిపోతోందని ఫ్రామాటోమ్‌  ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇటీవలే అమెరికా సాయం కోరుతూ ఓ లేఖ రాయగా.. అది మీడియాలో వెలుగులోకి వచ్చింది. కానీ, చైనా అధికారులు మాత్రం ప్లాంట్‌ అత్యంత సురక్షితంగా ఉందని చెబుతున్నారు. రేడియేషన్‌ వ్యాప్తిలో ఎటువంటి అసాధారణ లక్షణాలు కనిపించడంలేదని తెలిపారు.

ఇక్కడ ఉన్న రెండు అణు రియాక్టర్లలో ఒక దానిలో ఇంధన రాడ్లు దెబ్బతిన్నట్లు జూన్‌లో కనిపెట్టారు. ఈ రియాక్టర్‌లోని  మొత్తం 60 వేల ఇంధన రాడ్లలో కేవలం 5 మాత్రమే దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇది ప్రమాదకరం కాదని పేర్కొంటున్నారు. దీంతోపాటు  రియాక్టర్‌లో వాడే కొన్ని నోబెల్‌ గ్యాసుల స్థాయి పెరిగినట్లు ఫ్రాన్స్‌ కంపెనీ గుర్తించింది.  సాధారణంగా రేడియో యాక్టివిటీ పెరిగితే హీలియం, జెనాన్‌, క్రిప్టాన్‌ గ్యాసుల స్థాయి పెరుగుతుంది. ఇవి అణుఇంధన రాడ్లు ధ్వంసమైనప్పుడు వెలువడతాయి. కర్మాగారంలో వీటి స్థాయి పెరిగే ప్లాంట్‌లో కొన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడంలేదనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి. అమెరికాలో కూడా 1994-2006 మధ్యలో మొత్తం అణు ఇంధన రాడ్లలో 2శాతం వరకు ఇలా ధ్వంసం అయ్యాయి.

రేడియేషన్‌ పరిధి పెరిగినట్లు చైనా అధికారులు కూడా గుర్తించారు. కానీ, రేడియేషన్‌ లీకేజీ పరిస్థితికి.. దీనికి ఎటువంటి సంబంధం లేదన్నారు. రేడియేషన్‌ను అడ్డుకొనే భౌతిక కట్టడాలు పటిష్ఠంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని