Covid టీకా.. అపర కుబేరులను చేసింది

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కొన్ని ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలతో కలిసి ముమ్మర పరిశోధనలు సాగించాయి. శరవేగంగా వ్యాక్సిన్లు తయారుచేశాయి.

Updated : 20 May 2021 17:14 IST

పారిస్‌: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కొన్ని ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలతో కలిసి ముమ్మర పరిశోధనలు సాగించాయి. శరవేగంగా వ్యాక్సిన్లు తయారుచేశాయి. వారి శ్రమ ఫలించి ఇప్పుడు పలు సంస్థల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ప్రపంచంలోని ప్రజలందరికీ ఎప్పుడు చేరుతాయో తెలియదు గానీ.. వ్యాక్సిన్ల పుణ్యమా అని ఆయా సంస్థలు భారీ లాభాలను గడించాయి. కరోనా టీకాలు.. కొత్తగా మరో 9 మందిని బిలియనీర్లను చేశాయి. 

టీకా తెచ్చిన లాభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపరకుబేరుల జాబితాలో 9 మంది కొత్తగా చేరారని ది పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ అనే కాంపెయిన్‌ గ్రూప్‌ తెలిపింది. ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌  ఆధారంగా ఈ 9 మంది మొత్తం నికర సంపద 19.3 బిలియన్‌ డాలర్లు అని పేర్కొంది. అంతేగాక, ఇప్పటికే బిలియనీర్ల జాబితాలో ఉన్న మరో 8 మంది సంపద టీకాలు వచ్చిన తర్వాత 32.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది. కొత్తగా చేరిన కుబేరుల్లో మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌, బయోఎన్‌టెక్‌ వ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ ముందువరుసలో ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ కంపనీ కాన్‌సినో బయోలాజిక్స్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు. 

కొత్తగా చేరిన బిలియనీర్ల మొత్తం సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలందరికీ 1.3 రెట్లు టీకాలు అందించొచ్చని  పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ పేర్కొంది. టీకాలతో ఫార్మా కంపెనీలు భారీ లాభాలను సాధించాయని చెప్పేందుకు ఈ కుబేరులే నిదర్శనమని, ఇకనైనా వ్యాక్సిన్‌ టెక్నాలజీపై దిగ్గజ కార్పొరేషన్ల ఏకఛత్రాదిపత్యం ఆగాలని పిలుపునిస్తోంది. కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్‌ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని