Karnataka: సావర్కర్‌- టిప్పుసుల్తాన్‌ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!

కర్ణాటకలోని శివమొగ్గలో ఫ్లెక్సీల విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణంలోని అమిర్‌ అహ్మద్‌ సర్కిల్‌ వద్ద హిందుత్వ ఐకాన్‌ వీడీ సావర్కర్‌, ......

Published : 15 Aug 2022 22:58 IST

(ఇరువర్గాలు ఫెక్లీలు పెట్టాలనుకున్న చోట జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్న పోలీసులు)

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఫ్లెక్సీల విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణంలోని అమిర్‌ అహ్మద్‌ సర్కిల్‌ వద్ద హిందుత్వ ఐకాన్‌ వీడీ సావర్కర్‌, 18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో శివమొగ్గలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో ప్రేమ్‌ సింగ్‌ అనే యువకుడు షాప్‌కు తాళం వేసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆ యువకుడిపై కత్తితో దాడి ఘటనకు ఈ ఫ్లెక్సీ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

76వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అమిర్‌ అహ్మద్‌ సర్కిల్‌లోని ఓ విద్యుత్‌ స్తంభానికి ఒకవర్గం వారు సావర్కర్‌ ఫ్లెక్సీని కట్టేందుకు ప్రయత్నించగా.. మరోవర్గం వారు అభ్యంతరం తెలిపారు. అక్కడ టిప్పు సుల్తాన్‌ ఫ్లెక్సీని కట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కొందరు ఫ్లెక్సీని మార్చడానికి లేదా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తతలకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు. వారిని చెదరగొట్టి ఉద్రిక్తతలు అదుపుచేసేందుకు స్వల్ప లాఠీఛార్జి చేసినట్టు చెప్పారు. అలాగే, రెండు వర్గాల వారు ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ సావర్కర్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా, పలు హిందూ గ్రూపులకు చెందినవారు నిరసనకు దిగారు. అలాగే, సావర్కర్‌ ఫ్లెక్సీని కట్టకుండా అడ్డుకొన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించడంతో పాటు 144 సెక్షన్‌ అమలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని