SC: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు జడ్జీ సహా 68 మంది గుజరాత్‌ న్యాయమూర్తుల (Gujarat lower judicial officers) ప్రమోషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Published : 12 May 2023 17:12 IST

దిల్లీ: గుజరాత్‌ (Gujarat)లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష విధించిన సూరత్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ వర్మ  (Harish Hasmukhbhai Varma) కూడా ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ సహా 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జీ కేడర్‌కు ప్రమోట్‌ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ హైకోర్టు (Gujarat HC) సెలక్షన్‌ జాబితాను జారీ చేసింది. అయితే, ఈ జాబితాను సవాల్‌ చేస్తూ సివిల్‌ జడ్జీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మెరిట్- కమ్- సీనియారిటీ’ ఆధారంగా కాకుండా.. ‘సీనియారిటీ- కమ్- మెరిట్‌’ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్‌ ప్రభుత్వం, గుజరాత్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ.. గుజరాత్‌ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్‌ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.

‘‘ఈ కోర్టు నిర్ణయానికి విభిన్నంగా ఆ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించడం చట్టవిరుద్ధం. ఆ ప్రమోషన్‌ జాబితా అమలుపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత పదవుల్లోకి వెళ్లిపోవాలి’’ అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తగిన ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.

2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి హస్ముఖ్‌ వర్మ ఈ కేసును విచారించి.. రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ నేత తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని