Agnipath: శాంతియుతంగా నిరసన తెలపండి.. కానీ ఆపొద్దు: ప్రియాంకా గాంధీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం సైన్యాన్ని అంతం చేస్తుందని కాంగ్రెస్‌ ప్రధాన నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు........

Published : 19 Jun 2022 18:13 IST

దిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకం సైన్యాన్ని అంతం చేస్తుందని కాంగ్రెస్ (Congress) నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న ప్రియాంక ఆదివారం మరోసారి తన గళం వినిపించారు. నిరుద్యోగులు తమ నిరసనలు ఆపొద్దని, కానీ శాంతియుతంగా కొనసాగించి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలంటూ పిలుపునిచ్చారు.

‘ఈ పథకం దేశంలోని యువతను చంపేస్తుంది. సైన్యాన్ని అంతం చేస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్దేశం సరైంది కాదు. ప్రజాస్వామ్య, శాంతియుత, అహింసా మార్గాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి. మీ లక్ష్యం దేశానికి నిజమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. దేశ ఆస్తులను రక్షించండి. శాంతియుతంగా నిరసన తెలపాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే మీ నిరసనలను ఆపొద్దు. ఇది మీ దేశం.. దీన్ని రక్షించడం మీ కర్తవ్యం. కాంగ్రెస్‌ పార్టీలోని ప్రతి నేత, కార్యకర్త మీ వెంట ఉన్నారు’ అని ఓ వీడియో సందేశంలో ప్రియాంక పేర్కొన్నారు.

వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచడాన్ని ప్రియాంక గాంధీ శనివారం ప్రశ్నించారు. ‘24 గంటలు గడవకముందే భాజపా ప్రభుత్వం సైనిక నియామకాల పథకం నిబంధనలను మార్చాల్సి వచ్చింది. ఇది చూస్తుంటే ఈ అగ్నిపథ్‌ నిర్ణయాన్ని హడావుడిగా తీసుకొన్నట్లు తెలుస్తోంది. మోదీజీ దీనిని వెంటనే వెనక్కి తీసుకోండి. వైమానిక దళంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియ ఫలితాలు వెల్లడించండి. వయో సడలింపుతో మునుపటిలా ఆర్మీ నియామకాలను చేపట్టండి’ అంటూ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని