Farm Laws: సాగు చట్టాల రద్దు.. రైతు నేత టికాయత్‌ ఏమన్నారంటే..!

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌

Updated : 19 Nov 2021 16:53 IST

ఘాజియాబాద్‌: నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ స్పందించారు. చట్టాల రద్దుపై ప్రకటన చేసినప్పటికీ తాము ఉద్యమాన్ని ఇప్పుడే ఆపబోమని అన్నారు. ‘‘ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోం. పార్లమెంట్లో మూడు చట్టాల రద్దు జరిగే రోజు వరకూ ఎదురుచూస్తాం. ఇక కనీస మద్దతు ధరతో పాటు మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉంది’’ అని టికాయత్‌ ట్వీట్‌ చేశారు. 

సరిహద్దుల్లో సంబరాలు.. 

సాగు చట్టాల రద్దు మోదీ ప్రకటన చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఘాజీపూర్‌ సరిహద్దుల్లో ఆందోళన పాల్గొన్న రైతు నేతలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.  కేంద్రం నిర్ణయంపై సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంట్‌లో ప్రక్రియ పూర్తయిన తర్వాతే చట్టాల రద్దు అమల్లోకి వస్తుంది. అది జరిగితే.. ఏడాది పాటు రైతులు సాగించిన పోరాటానికి చారిత్రక విజయం లభించినట్లే’’ అని ఎస్‌కేఎం వెల్లడించింది. 

గతేడాది సెప్టెంబరులో మూడు నూతన సాగు చట్టాలను కేంద్రం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దేశంలో పలు చోట్ల అన్నదాతలు ఆందోళనలు, ధర్నా చేపట్టారు. గతేడాది నవంబరు 25న పంజాబ్‌, హరియాణా నుంచి వేలాది మంది రైతులు ‘చలో దిల్లీ’ పేరిట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని సరిహద్దుల్లోనే బైఠాయించారు. నాటి నుంచి ఏడాదిగా సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు విడతల్లో చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఆందోళనలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఇటీవల రాకేశ్‌ టికాయత్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం గమనార్హం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని