Wrestlers Protest: చట్టం అందరికీ సమానమే.. రెజ్లర్లతో భేటీలో అమిత్ షా

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌ కేసు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నట్లు తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఇటీవల ఆయనతో సమావేశమైనట్లు సమాచారం.

Updated : 05 Jun 2023 10:33 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన (Wrestlers Protest)కు దిగిన భారత అగ్రశ్రేణి రెజర్లు.. కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah)తో భేటీ అయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. బ్రిజ్‌ భూషణ్‌పై త్వరితగతిన ఛార్జ్‌షీట్‌ దాఖలయ్యేలా చూడాలని రెజ్లర్లు కేంద్రమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

శనివారం రాత్రి 11 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో రెజ్లర్లు బజ్‌రంగ్‌ పునియా (Bajrang Punia), సాక్షి మలిక్‌ (Sakshee Malikkh), సంగీతా ఫొగాట్‌ (Sangita Phogat), సత్యవర్త్‌ కడియన్‌ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బ్రిజ్‌భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరిపించాలని, వేగంగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు. అయితే ‘‘చట్టం అందరికీ సమానమే.. చట్టాన్ని తన పని తాను చేయనివ్వండి’’ అని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. తాము కేంద్రమంత్రితో భేటీ అయినట్లు బజ్‌రంగ్‌ పునియా మీడియా వద్ద ధ్రువీకరించారు. అయితే, ప్రస్తుతానికి అంతకంటే తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: క్కడపడితే అక్కడ చేతులేసేవారు

బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రెజ్లర్లు.. ఇటీవల కొత్త పార్లమెంట్‌ ప్రారంభం రోజున చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. జంతర్‌మంతర్‌ నుంచి నూతన పార్లమెంట్‌కు బయల్దేరిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి జంతర్‌మంతర్‌ను ఖాళీ చేయించారు. ఆ సమయంలో రెజ్లర్లతో పోలీసులు ప్రవర్తించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెజ్లర్లు.. ఇటీవల హరిద్వారా వెళ్లి గంగనదిలో తమ పతాకాలను కలిపేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో రైతు సంఘాల నేతల సూచనతో వెనక్కి తగ్గారు. మరోవైపు రెజర్లకు మద్దతుగా నిలిచిన భారతీయ కిసాన్‌ యూనియన్‌.. బ్రిజ్‌భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. లేదంటే.. వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని