రగులుతున్న మయన్మార్‌

మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

Updated : 15 Feb 2021 12:41 IST

సైనిక పాలనకు వ్యతిరేకంగామిన్నంటిన ఆందోళనలు 

యాంగూన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు

యాంగూన్‌: మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు యాంగూన్‌లో సైనిక సాయుధ శకటాలు తిరుగాడటం, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తారన్న ప్రచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైనిక ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా ఆదివారం యాంగూన్, మాండలే, నేపిటవ్‌ తదితర నగరాల్లో పెద్దఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘సైబర్‌స్పేస్‌’లోనూ భారీగా నిరసన వ్యక్తమవుతోంది. ‘బ్రదర్‌హుడ్‌ ఆఫ్‌ మయన్మార్‌ హ్యాకర్స్‌’ అనే సంస్థ ఏకంగా ప్రభుత్వ డిజిటల్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌లో సమాచారాన్నే మార్చేసింది. హోంపేజీలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా సమాచారాన్ని, ఫొటోలను పెట్టింది. యాంగూన్‌లో చైనాను వ్యతిరేకిస్తూ.. అమెరికాను అభినందిస్తూ.. ఆయా రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనకారులు ప్రదర్శన చేపట్టారు. మిలటరీ పాలనను ప్రోత్సహిస్తోందంటూ చైనాకు వ్యతిరేకంగా నినదించారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలకు మద్దతిస్తున్న అమెరికాను శ్లాఘించారు. సైన్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాలనూ తిరస్కరించాలంటూ ఆందోళనకారులు ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా నిరసనల్లో ప్రభుత్వ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. రైల్వే కార్మికులు కూడా ఆందోళనల్లో చేరినట్లు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఆంక్షలు.. ఆదేశాలు..
మయన్మార్‌లో అనేక ప్రాథమిక పౌర స్వేచ్ఛలను రద్దుచేస్తూ సైనిక ప్రభుత్వం శనివారం ఆదేశాలిచ్చింది. ఈమేరకు ప్రజల భద్రత, వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న చట్టంలోని నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేసింది. కోర్టు వారెంట్లు లేకుండానే ఎక్కడైనా సోదాలు చేయడానికి, అరెస్టులు చేయడానికి అధికారులకు వీలు కల్పించింది. కాగా కొన్నిచోట్ల ఆందోళనలను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్‌ తూటాలు వాడుతున్నారు. జైలు నుంచి నేరస్థులను విడిచిపెట్టి సైన్యం హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈమేరకు గత వారం సైనిక ప్రభుత్వం 23 వేల మంది దోషులను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. వీరిలో చాలామందిని హింసాత్మక ఘటనలు ప్రేరేపిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. వారంతా రాత్రివేళల్లో ఇళ్లకు నిప్పు పెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడతారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యాంగూన్‌లో సాయుధ శకటాలు..
మయన్మార్‌లోని అతిపెద్ద నగరమైన యాంగూన్‌లోని వీధుల్లో ఆదివారం ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే సాయుధ శకటాలు తిరిగాయి. ఈ దృశ్యాలు, సంబంధిత వార్తలు రాత్రి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సోమవారం వేకువజామున 1 నుంచి ఉదయం 9 గంటల వరకు మొబైల్‌ సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ ఇచ్చినట్లు ఆదేశాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇవీ చదవండి..
అంతరిక్షంలోకి మోదీ ఫొటో..! 

నేపాల్‌, శ్రీలంకలోనూ భాజపా విస్తరణ!
 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts