Agnipath: నాలుగేళ్ల తర్వాత మాటేంటి?.. ‘అగ్నిపథ్’పై పలుచోట్ల నిరసనలు!
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ....
ఇంటర్నెట్ డెస్క్: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ‘అగ్నిపథ్’ (Agnipath) పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అవుతున్న పలువురు యువకులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ట్వీట్ చేశారు. సాయుధ బలగాల శౌర్యపరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడొద్దని కోరారు. అలాగే, ఇంకొందరు అనుభవజ్ఞులు కూడా ఈ అంశంలో పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవేంటంటే?
- అగ్నిపథ్ పథకంపై బిహార్‌లోని ముజఫర్‌పూర్, బక్సార్, బెగూసరాయ్‌లో పలువురు యువకులు నిరసన వ్యక్తంచేశారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందన్నారు.
- ‘‘భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని భాజపా సర్కార్ మానుకోవాలి’’ అని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్‌పై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అంటూ ప్రశ్నించారు.
- ఈ కొత్త పథకంపై కొందరు అనుభవజ్ఞులతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే, రిస్క్ తీసుకోవడంలోనూ అంత చొరవ ప్రదర్శించరని పేర్కొంటున్నారు.
- కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశానికి గానీ, యువతకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా విమర్శించారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలన్నారు. సాయుధ దళాల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న సైనికులకు వారి ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలుగా హేతుబద్ధీకరించేలా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
- ఈ అంశంపై విశ్రాంత మేజర్ జనరల్ బీఎస్ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్ చేశారు. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.
- ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కొన్నేళ్లుగా ప్రిపేర్ అవుతున్న శివమ్ కుమార్ అనే యువకుడు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు పరుగెత్తుతున్నా. శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయాలా?’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
- సైనిక బలగాల రిక్రూట్‌మెంట్‌ను కేవలం ఆర్థికపరమైన కోణంలోనే చూడటం సరికాదని సీనియర్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ యష్ మోర్ అన్నారు. సైనికుల జీవితం, కెరీర్ అంశాలను ఖజానాకు డబ్బు ఆదా చేసే కోణంలో చూడొద్దని సూచించారు.
- కొత్త రిక్రూట్మెంట్ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గించుకోవడంతో పాటు ఆయుధాల సేకరణ కోసం అధిక నిధులు వెచ్చించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కేంద్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 46 వేల మందిని నాలుగేళ్ల సర్వీసుపై ఈ ఏడాది నియమించుకోనుంది. వీరికి సర్వీసు కాలంలో నెలవారీగా రూ.30 నుంచి 40వేల మధ్య (ఇతర అలవెన్సులు మినహాయించి) చెల్లించనున్నారు. వీటితో పాటు వైద్య, బీమా సదుపాయం కూడా కల్పిస్తారు.
- నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. పెన్షన్ ప్రయోజనాలూ ఉండవు.
- ఈ పథకంలో భాగంగా అగ్ని వీరులుగా చేరే పదో తరగతి విద్యార్థులకు 12వ తరగతి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. ఇంకా దీనిపై స్పష్టతలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!