PT Usha: రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన పీటీ ఉష

పెద్దల సభ(Rajya Sabha)లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ అథ్లెట్‌  పీటీ ఉష(PT Usha) గురువారం ఛైర్మన్ కుర్చీలో కూర్చొని..రాజ్యసభ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

Published : 09 Feb 2023 15:45 IST

దిల్లీ: పెద్దల సభ(Rajya Sabha)లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ అథ్లెట్‌  పీటీ ఉష(PT Usha) గురువారం ఛైర్మన్ కుర్చీలో కూర్చొని..రాజ్యసభ కార్యకలాపాలను పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉష ట్విటర్‌లో షేర్ చేసి.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

‘ప్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చెప్పిన విధంగా.. గొప్ప స్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది. రాజ్యసభ సెషన్‌ను నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావనే కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణంలో మరింత పరిణితి సాధిస్తాను’ అని బాధ్యతలు నిర్వహిస్తోన్న వీడియోను షేర్ చేశారు. దీంతో ఆమెకు అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘గర్వంగా ఉంది ఉష. నువ్వు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరోసారి చరిత్ర సృష్టించు. నువ్వు మహిళలందరికీ స్ఫూర్తి’ అంటూ పోస్టులు పెడుతున్నారు.  

రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లేని సమయంలో వైస్‌ ఛైర్‌పర్సన్స్‌ కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు చూస్తారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష.. ఈ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా పేరొందిన ఆమె.. ఆసియా గేమ్స్‌లో పలుమార్లు స్వర్ణ పతకం సాధించారు. 1984 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. భారత ఒలింపిక్‌ సంఘం(IOA) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని