CPGRAMS: 30 రోజుల్లోనే పరిష్కరించాలి.. ప్రజాఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం

ప్రభుత్వంలోని వివిధ శాఖలకు అందుతున్న ప్రజాఫిర్యాదుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్ఠ కాలపరిమితిని ప్రస్తుతం ఉన్న 45 రోజుల నుంచి 30 రోజులకు...

Updated : 22 Nov 2022 16:07 IST

దిల్లీ: ప్రభుత్వంలోని వివిధ శాఖలకు అందుతున్న ప్రజా ఫిర్యాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్ఠ కాలపరిమితిని ప్రస్తుతం ఉన్న 45 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఒకవేళ ఫిర్యాదుదారు తన ఫిర్యాదు పరిష్కారంపై అప్పీల్‌ చేసుకుంటే.. పరిష్కరించిన తర్వాతే దాన్ని మూసివేసినట్లుగా గుర్తించాలని నిర్ణయించింది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘పాలనాపరమైన సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల విభాగం(డీఏఆర్‌పీజీ)’ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల సేవల విషయంలో ఫిర్యాదుల కోసం.. ‘కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీగ్రామ్స్‌)’ పేరిట ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థలో తాజాగా సంస్కరణలు చేపట్టినట్లు డీఏఆర్‌పీజీ వెల్లడించింది. ‘సీపీగ్రామ్స్‌లో స్వీకరించిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా, గరిష్ఠంగా 30 రోజుల వ్యవధిలోపు పరిష్కరిస్తారు. లేని పక్షంలో ఫిర్యాదుదారుకి తగిన ప్రత్యుత్తరం అందజేస్తారు’ అని తెలిపింది. తాజా నిర్ణయాలు తమ ప్రభుత్వ ‘విశ్వాస ఆధారిత పాలనా నమూనా’ను ప్రతిబింబిస్తాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి అన్ని విభాగాలకు ‘నోడల్ ఫిర్యాదుల పరిష్కార అధికారుల(జీఆర్‌ఓ)’ను నియమించాలని, ఈ మేరకు వారికి తగిన అధికారాలు ఇవ్వాలని డీఏఆర్‌పీజీ తన ఉత్తర్వుల్లో సూచించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఫిర్యాదులను పరిష్కరించడం వీరి బాధ్యత. ఫిర్యాదుకు పరిష్కారం లభించిన తర్వాత.. పౌరులు తమ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు. పరిష్కారం సంతృప్తికరంగా లేకపోతే దానిపై అప్పీల్‌ చేసుకోవచ్చు. మరోవైపు.. పరిష్కరించిన ఫిర్యాదులపై ఫీడ్‌బ్యాక్ పొందేందుకు అధికారులే ఫిర్యాదుదారులకు ఫోన్‌ కాల్స్ చేసేలా అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఉత్తర్వులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని