
Puducherry: కొలువుదీరిన మంత్రివర్గం!
ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
పుదుచ్చేరి: ఎన్నికలు పూర్తైన యాభై రోజుల తర్వాత పుదుచ్చేరిలో మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రంగస్వామి ఐదుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నూతన మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ముగ్గురు ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందినవారు కాగా.. భాజపా తరపున నమశివాయం, సాయి శరవణన్ కుమార్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సీఎంతో పాటు మరో ఐదుగురు మంత్రులతో పుదుచ్చేరిలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. వీరిలో నమశివాయం ఎన్నికల ముందే కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఇక భాజపాకు పుదుచ్చేరి మంత్రివర్గంలో తొలిసారి చోటు లభించగా.. నాలుగు దశాబ్దాల కాలంలో తొలి మహిళా మంత్రిగా చాందిరా ప్రియాంకకు చోటు లభించడం విశేషం.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంత్రివర్గం కూర్పుపై దాదాపు 50 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. మే 7న ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. డిప్యూటీ సీఎం పదవి కోసం భాజపా పట్టుబట్టడంతో మంత్రివర్గ కూర్పుపై ముందడుగు పడలేదు. చివరకు స్పీకర్ పదవిని భాజపా అంగీకరించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రంగస్వామి మూడు రోజుల క్రితం గవర్నర్ తమిళిసైకి మంత్రుల జాబితాను అందజేశారు. పుదుచ్చేరిలో మొత్తం ఆరు మంత్రి పదవులకు గాను.. సీఎం రంగస్వామితో పాటు ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు మొత్తం నాలుగు లభించగా, భాజపాకు రెండు మంత్రి పదవులు దక్కాయి.
ఇదిలాఉంటే, మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలవగా.. భాజపా ఆరు చోట్ల విజయం సాధించింది. గతంలో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మాత్రం ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇక డీఎంకే ఆరు చోట్ల విజయం సాధించగా.. స్వతంత్రులు ఆరుచోట్ల విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఎన్డీయే (ఎన్‌ఆర్ కాంగ్రెస్ -భాజపా) కూటమికి మద్దతు తెలిపారు.