పుదుచ్చేరి సంక్షోభం: ఎల్‌జీ నిర్ణయంపై ఆసక్తి..!

ముఖ్యమంత్రి రాజీనామా అనంతరం, పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

Updated : 22 Feb 2021 15:24 IST

పుదుచ్చేరి: త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని తప్పించడం, అనంతరం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో శాసనసభలో బలపరీక్ష నిరూపించుకోవడంలోనూ విఫలమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకు రాజీనామా అందించారు. దీంతో తరువాత పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్‌జీ తీసుకునే కీలక నిర్ణయంపైనే పుదుచ్చేరి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌జీ ముందున్న అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆయననే ఎన్నికల వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించే అవకాశం. లేదా,

ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ప్రతిపక్షానికి ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రంగస్వామిని కోరే అవకాశం. లేదా,

అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేయడం. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరి భాజపా నియంత్రణలో ఉన్నట్లే. అయితే, ఈ ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అడిగే ముందు లేదా, అడిగిన తర్వాత ఎల్‌జీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఎల్‌జీ ముందు పలు అవకాశాలు ఉన్నాయి. అయితే, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎల్‌జీని కోరే అవకాశాలు ఉన్నప్పటికీ, విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఎల్‌జీ ఆయన సలహాను పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు.

ఇదిలాఉండగా, ప్రస్తుతం నాతో పాటు కేబినెట్‌ మంత్రులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు రాజీనామా సమర్పించామని సీఎం నారాయణస్వామి అన్నారు. వీటిపై ఎల్‌జీ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న ముఖ్యమంత్రి, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానికి స్పందించలేదు. దీంతో పుదుచ్చేరి తదుపరి రాజకీయ భవిష్యత్తు ఎల్‌జీ తమిళిసై సౌందరరాజన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని