H3N2: ఫ్లూ కలవరం.. పుదుచ్చేరిలో పాఠశాలలకు సెలవులు..!

హెచ్‌3ఎన్‌2 (H3N2 influenza) ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నట్లు పుదుచ్చేరి (Puducherry) విద్యాశాఖ ప్రకటించింది.

Updated : 15 Mar 2023 13:53 IST

పుదుచ్చేరి: దేశంలో పలుచోట్ల హెచ్‌3ఎన్‌2 (H3N2 influenza) క్రమంగా విజృంభిస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి (Puducherry) విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లలో 8వ తరగతి వరకు  సెలవులు ఇస్తున్నామని.. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది.

పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకు మరణాలు మాత్రం చోటుచేసుకోలేదు. కేసుల సంఖ్య పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇన్‌ఫ్లుయెంజా కేసులకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించాయి. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయినట్టు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. ఈ సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కారణంగా కర్ణాటక, హరియాణా, గుజరాత్‌లో సహా పలు రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని