pune: ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి గొంతెమ్మ కోర్కెలకు బదిలీ వేటు

అధికారిక హోదా కోసం ఆరాటపడుతూ ఓ ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి గొంతెమ్మ కోరికలు కోరడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది.

Published : 11 Jul 2024 03:56 IST

పుణె: అధికారిక హోదా కోసం ఆరాటపడుతూ ఓ ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి గొంతెమ్మ కోరికలు కోరడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది. పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూజా ఖేద్కర్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన సొంత ఆడి కారుకు రెడ్‌-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. కారుకు ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్‌ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబులుతో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. ఇంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. అక్కడున్న కుర్చీలు, సోఫాలు, టేబుళ్లతో సహా అన్నీ మార్చేశారు. తన పేరుతో లెటర్‌హెడ్, విజిటింగ్‌ కార్డ్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్‌ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు. రిటైర్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి అయిన పూజా ఖేద్కర్‌ తండ్రి సైతం తన కుమార్తె కోరినవి సమకూర్చాలని కలెక్టరేట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రొబేషనులో ఉన్న ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు ఇలా అదనపు సౌకర్యాలేవీ ఉండవు. పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్‌ డాక్టర్‌ సుహాస్‌ దివాసే చీఫ్‌ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాశిమ్‌ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్‌ న్యూమరరీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని