Sameer Wankhede: దేశభక్తితో ఉన్నందుకు శిక్ష : సీబీఐ తనిఖీలపై సమీర్‌ వాంఖెడే

ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కీలక అధికారి సమీర్‌ వాంఖెడే ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఈ దాడులపై సమీర్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.    

Published : 14 May 2023 12:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశభక్తితో ఉన్నందుకు సీబీఐ(CBI) దాడుల రూపంలో బహుమతి లభించిందని మాదకద్ర్యవ్య నిరోధక శాఖ మాజీ అధికారి సమీర్‌ వాంఖెడే(Sameer Wankhede) పేర్కొన్నారు. షారుఖ్‌ఖాన్‌(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సమయంలో రూ.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమీర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంపై శుక్రవారం సీబీఐ దాడులు నిర్వహించింది. దీనిపై సమీర్‌ స్పందిస్తూ తన భార్యాబిడ్డలతో ఇంట్లో ఉన్నప్పుడే 18 మంది అధికారులు వచ్చి తనిఖీలు చేశారని వెల్లడించారు.

‘‘నేను దేశభక్తుడిగా ఉన్నందుకు బహుమతి లభించింది. నిన్న 18 మంది సీబీఐ అధికారులు నా ఇంట్లో 12 గంటలపాటు తనిఖీలు చేశారు. ఆ సమయంలో నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. వారికి రూ.23,000 నగదు.. కొన్ని ఆస్తి పత్రాలు దొరికాయి. ఆ ఆస్తులు నేను సర్వీసులో చేరడానికి ముందే లభించాయి’’ అని వాంఖెడే పేర్కొన్నారు. ఈ దాడుల సమయంలో సీబీఐ తన భార్య క్రాంతి వద్ద నుంచి ఫోన్‌ను తీసుకొన్నట్లు వివరించారు. దీంతోపాటు నా సోదరి యాస్మిన్‌ ఇంటి నుంచి రూ. 28,000, నా తండ్రి ఇంటి నుంచి రూ.28,000, నా మామయ్య ఇంటి నుంచి రూ. 1,800 రికవరీ చేశారన్నారు. 

ఆర్యన్‌ ఖాన్‌ కేసులో లంచం డిమాండ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాంఖెడేతో సహా మరో ముగ్గురు అధికారులకు సంబంధించిన 29 చోట్ల శుక్రవారం సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పూర్‌లో జరిగాయి. లంచం డిమాండ్‌ ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ వాంఖెడేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే తనిఖీలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని