Heatstroke: దేశానికి వడదెబ్బ.. 40వేల కేసులు.. దిల్లీలో 192 మంది నిరాశ్రయులు మృతి!

మార్చి 1 నుంచి జూన్‌ 18 మధ్యకాలంలో దాదాపు 40వేల వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

Updated : 20 Jun 2024 15:15 IST

దిల్లీ: రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అనేక రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి. ఈ క్రమంలో మార్చి 1 నుంచి జూన్‌ 18 మధ్యకాలంలో దాదాపు 40 వేల వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే, జూన్‌లో కేవలం ఒక్క వారంలోనే దేశ రాజధానిలో 192 మంది ప్రాణాలు విడిచారని ఓ స్వచ్ఛంద సంస్ధ పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 36 వడదెబ్బ మరణాలు చోటుచేసుకోగా బిహార్‌, రాజస్థాన్‌, ఒడిశాలోనూ పదుల సంఖ్యలో మృత్యువాతపడినట్లు జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) ఆధ్వర్యంలోని ‘ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం, మరణాలపై జాతీయ పర్యవేక్షణ విభాగం’ వెల్లడించింది. ఇది ఆయా రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మాత్రమేనని.. వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 18న ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయినట్లు తెలిపాయి.

దిల్లీలో 192 మంది మృతదేహాలు..

భానుడి ప్రతాపానికి దేశ రాజధాని విలవిల్లాడుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్‌ 11-19 మధ్యలో వడదెబ్బ కారణంగా 192 మంది నిరాశ్రయులు మృత్యువాత పడినట్లు ‘సెంటర్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ (సీహెచ్‌డీ)’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే గడిచిన 48 గంటల్లో 50 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, వారంతా ఎండ వేడిమి కారణంగా చనిపోయారా? అనే విషయంపై స్పష్టత లేదన్నారు.

ఆసుపత్రుల్లో పెరుగుతోన్న చేరికలు..

వడదెబ్బ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో 33 మంది చేరగా.. అందులో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మొత్తంగా ఒక్కరోజులోనే సఫ్దర్‌జంగ్‌తోపాటు ఆర్‌ఎంఎల్‌, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రుల్లో కలిపి 20 మరణాలు నమోదయ్యాయి. 

వడదెబ్బ మరణాల నేపథ్యంలో.. ఈ రకమైన బాధితులకు ఆసుపత్రులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్నిరాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. అంతేకాకుండా వడదెబ్బ బాధితులు, మరణాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని