Published : 28 Mar 2022 18:34 IST

Bhagwant Mann: ‘ఇకపై క్యూ అవసరం లేదు.. మీ ఇంటి వద్దకే రేషన్!‌’

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కీలక ప్రకటన

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సోమవారం కీలక ప్రకటన చేశారు. పేదలు ఇకపై రేషన్‌ దుకాణాల ముందు ప్రజలు బారులు తీరాల్సిన అవసరం లేదనీ.. వారి ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్‌ను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్‌ మాత్రమేనన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘‘రేషన్‌ సరకుల్ని ప్రజల ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఆప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ పథకం కింద నాణ్యమైన రేషన్‌ సరకుల్ని లబ్ధిదారులకు అందించబోతున్నాం. ఇకపై ఎవరూ క్యూలలో ఉండాల్సినవసరంలేదు/దీని కోసం సెలవు పెట్టాల్సిన పనీలేదు. మా అధికారులే లబ్ధిదారులకు ఫోన్‌ చేసి మీకు అనువైన సమయంలో వచ్చి సరకులు పంపిణీ చేస్తారు. ఈ పథకం ఐచ్ఛికమే. ఎవరికైనా రేషన్‌ డిపో దగ్గర్లోనే ఉంటే వారు వెళ్లైనా తెచ్చుకోవచ్చు’’ అన్నారు.

‘‘దిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. కానీ పంజాబ్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తాం. విజయవంతంగా కొనసాగిస్తాం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా పేదలు, సామాన్యులు సరకులు పొందేందుకు ఇప్పటికీ రేషన్‌ డిపోల ముందు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ డిజిటల్‌ యుగంలో అనేక ఆహార వస్తువులు, నిత్యావసరాలు ఒక్క ఫోన్‌ కాల్‌తో ఇంటి ముంగిటకు వచ్చిపడుతున్నాయి. కానీ, పేదలు.. ముఖ్యంగా దినసరి వేతనానికి పనిచేసేవారు రేషన్‌ కోసం ఆరోజు తమ పనిని వదులుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ పూటగడవని కుటుంబాలు రేషన్‌ కోసం పని మానుకోవడం ఎంతో బాధాకరం. అనేకమంది వృద్ధ మహిళలు రెండు కి.మీల మేర నడిచి వెళ్లి రేషన్‌ డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడం నాకు తెలుసు. ఇలాంటి కష్టాలు ఇకపై ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు ఉండాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు’’ అన్నారు.

పంజాబ్‌లో మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్లు!

మరోవైపు, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటనపై దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం ప్రకటించారు. పంజాబ్‌ సీఎం ప్రకటన ఎంతో గొప్పదనీ.. ఇది పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఒకసారి పంజాబ్‌లో ఇంటివద్దకే రేషన్‌ సరకుల పంపిణీ పథకం మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల్లో ఈ డిమాండ్‌ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఈ పథకాన్ని మొదలుపెట్టేందుకు తాము ప్రయత్నించగా.. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలుకాకుండా అడ్డుపడిందని ఆరోపించారు. ఆలోచనకు సమయం వస్తే.. అది ఆగదన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts